YS Jagan: మీ దగ్గరున్న ప్రభుత్వ ఫర్నిచర్‌ను వెంటనే వెనక్కి ఇవ్వండి.. జగన్‌కు సచివాలయ జీఏడీ లేఖ
- ఓటమి పాలైన 15 రోజుల్లో ప్రభుత్వ ఫర్నిచర్‌ను వెనక్కి ఇవ్వాలని నిబంధనలు
- నేటితో గడువు ముగుస్తున్నా జగన్ నుంచి రాని స్పందన
- జగన్ వద్ద ఉన్న వస్తువులతో లేఖ రాసిన సచివాలయ జీఏడీ
ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్‌ను ఇంకా తన ఇంట్లోనే ఉంచుకోవడంపై విమర్శలు వినిపిస్తున్న వేళ తాజాగా సచివాలయ జీఏడీ లేఖ రాసినట్టు తెలిసింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 15 రోజుల్లో ప్రభుత్వ సామగ్రిని వెనక్కి అప్పగించాల్సి ఉంటుంది. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు రాగా నేటితో 15 రోజుల గడువు పూర్తవుతుంది. అయినప్పటికీ జగన్ నుంచి ఫర్నిచర్ అప్పగింతపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో రంగంలోకి దిగిన జీఏడీ ఆయనకు లేఖ రాసినట్టు సమాచారం. సచివాలయ నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సీఎంవోలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టం, ఇతర ఫర్నిచర్‌ను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలని లేఖలో పేర్కొన్నారు.
జగన్ నివాసంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. గతంలో ఇదే విషయంలో దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌ను హింసించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని, అలాంటిది ఇప్పుడు స్వయంగా జగనే ప్రభుత్వ ఫర్నిచర్‌ను ఎలా ఉంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత అప్పిరెడ్డి స్పందిస్తూ.. తమ వద్దనున్న ఫర్నిచర్‌కు లెక్కకడితే డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. అప్పిరెడ్డి స్పందనను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదు.