Vladimir Putin: రెండున్నర దశాబ్దాల తర్వాత ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన పుతిన్.. కిమ్ ఆలింగనం

Russian President Putin Gets Lavish Welcome In North Korea
  • ప్యాంగ్యాంగ్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం
  • అమెరికా ఆంక్షలను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్చలు
  • పుతిన్‌కు సైనిక వందనం.. చూసేందుకు తరలివచ్చిన జనం
  • ఉక్రెయిన్‌తో యుద్ధం, రష్యా విధానానికి కిమ్ మద్దతుపై కృతజ్ఞతలు
  • ఉత్తర కొరియా-రష్యా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని కిమ్ ఆశాభావం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఉత్తర కొరియాలో ఘన స్వాగతం లభించింది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత అరుదైన సదస్సు కోసం నార్త్ కొరియాలో అడుగుపెట్టిన పుతిన్‌ను జనం కేరింతలతో అట్టహాసంగా ఆహ్వానించారు. 

అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా పుతిన్ నేడు రాజధాని ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. రాజధాని మీదుగా ప్రవహించే తైడాంగ్ నది పక్కనున్న స్క్వేర్ వద్ద పుతిన్‌కు సైనిక వందనం లభించింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పౌరులు కూడా పెద్ద సంఖ్యలో హాజరైనట్టు రష్యన్ మీడియా పేర్కొంది. బెలూన్లు చేపట్టిన చిన్నారులు, గ్రాండ్ పీపుల్స్ స్టడీ హాల్‌లో జాతీయ జెండాలతో కూడిన ఇద్దరు నేతల భారీ చిత్రపటాలు ఉండడం రష్యన్ మీడియా ప్రసారం చేసిన వీడియోలో కనిపించింది.  

కిమ్, పుతిన్ ఇద్దరూ కలిసి ఆ తర్వాత చర్చల కోసం కుమసుసాన్ ప్యాలెస్‌కు వెళ్లారు. ఉక్రెయిన్‌తో యుద్ధం సహా రష్యన్ విధానానికి నార్త్ కొరియా అందిస్తున్న మద్దతుకు పుతిన్ కృతజ్ఞతలు తెలిపినట్టు మీడియా పేర్కొంది. అమెరికా, దాని మిత్రదేశాల ఆధిపత్య, సామ్రాజ్యవాద విధానాలపై మాస్కో పోరాడుతుందని పుతిన్ చెప్పినట్టు వివరించింది. 

ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా-రష్యా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ప్యాంగ్యాంగ్ విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌ను కిమ్ జోంగ్ ఉన్ ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు.
Vladimir Putin
Russia
North Korea
Kim Jong Un

More Telugu News