Mallu Bhatti Vikramarka: సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధానిని కలుస్తాం: భట్టివిక్రమార్క
- బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని వ్యాఖ్య
- బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మండిపాటు
- సింగరేణి తెలంగాణకే తలమానికమన్న భట్టివిక్రమార్క
సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీని కలుస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోందని... ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సింగరేణి, బొగ్గు గనులపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. గనుల వేలం సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు.
సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని... ఇది తెలంగాణకే తలమానికం అన్నారు. సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారని వెల్లడించారు. తెలంగాణలో 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. 2033 నాటికి 22 గనులు మూతపడి ఉత్పత్తి 15 మిలియన్ టన్నులకు పడిపోతుందన్నారు. కాబట్టి కొత్త గనులను సింగరేణి దక్కించుకోవాలన్నారు. కేంద్రం బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిందని... కొత్త గనులను దక్కించుకోకుంటే చరిత్రలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బొగ్గు గనుల వేలం సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటలు రాష్ట్రానికి మంచివి కాదన్నారు. దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని బీజేపీ చట్టం తీసుకు వచ్చిందని ఆరోపించారు. అందుకే బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలని షరతు విధించిందన్నారు. దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు పలికిందని వ్యాఖ్యానించారు.