Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

Delhi court grants bail for CM Kejriwal
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్
  • ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు
  • తీర్పు రిజర్వ్ లో ఉంచిన కోర్టు
  • తాజాగా తీర్పు వెలువరించిన జడ్జి న్యాయ్ బిందు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ న్యాయస్థానం ఊరట కలిగించింది. కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా, వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి న్యాయ్ బిందు తీర్పును వెలువరించారు. రూ.1 లక్ష పూచీకత్తుతో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. 

అయితే, పైకోర్టులో అప్పీల్ కు వెళ్ళడానికి వీలుగా బెయిల్ బాండ్ పై సంతకం చేయడానికి 48 గంటల సమయం ఇవ్వాలని ఈడీ... కోర్టును కోరింది. అయితే, న్యాయమూర్తి న్యాయ్ బిందు ఈడీ విజ్ఞప్తిని తోసిపుచ్చారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి తీహార్ జైలుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
Arvind Kejriwal
Bail
Delhi Court
Delhi Liquor Scam
AAP

More Telugu News