Rohit Sharma: మేము అదే చేశాం.. అందుకే ఈ అద్భుత విజయం: రోహిత్ శర్మ
- బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఆఫ్ఘన్, భారత్ మ్యాచ్
- ఆఫ్ఘనిస్థాన్‌ను 47 రన్స్ తేడాతో చిత్తు చేసిన టీమిండియా
- ఈ సునాయాస విజయం పట్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం
- జట్టు సభ్యులందరూ అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందన్న కెప్టెన్
- అక్కడి పరిస్థితులపై విస్తృతమైన అవగాహన కూడా తమకు కలిసొచ్చిందని వ్యాఖ్య
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సునాయాస విజయం పట్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. జట్టు సభ్యులందరూ అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. అలాగే స్థానిక పరిస్థితులపై విస్తృతమైన అవగాహన ఉండడంతో ప్రణాళికాబద్ధంగా వెళ్లి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసినట్లు తెలిపాడు.
మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. "గత రెండేళ్లుగా మేము ఇక్కడ టీ20లు ఆడుతున్నాం. కాబట్టి మేము ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నాం. తదనుగుణంగా ప్లాన్ చేశాం. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడంతో 180 పరుగుల మంచి స్కోర్ సాధించాం. ఇది బ్యాటర్ల నుండి గొప్ప ప్రయత్నం. అలాగే మాకు క్లాస్ బౌలర్లు ఉన్నారు. దానిని సంపూర్ణంగా ఉపయోగించుకున్నాం. ప్రతిఒక్కరూ వచ్చి వారి పని వారు చేశారు. ఇక బ్యాటింగ్ సమయంలో పిచ్ కొంచెం స్లోగా ఉండడంతో బ్యాటర్లకు రన్స్ రాబట్టడం క్లిష్టంగా మారింది. సూర్య, హార్దిక్ కీలకమైన భాగస్వామ్యం అందించడం మాకు కలిసొచ్చింది. ఆ తర్వాత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 4-1-7-3తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతను ఏమి చేయగలడో మాకు తెలుసు. అతన్ని తెలివిగా ఉపయోగించడం మాకు ముఖ్యం. ఈ మ్యాచ్‌లో అదే చేశాం. ఫలితం వచ్చింది " అని రోహిత్ చెప్పాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అయితే రాబోయే మ్యాచ్‌లలో పరిస్థితులను బట్టి మళ్లీ పేస్ బౌలింగ్ అటాక్ అవసరం రావచ్చని రోహిత్ తెలిపాడు. కాగా, గ్రూప్ దశలో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. అయితే, ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో మాత్రం పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించడం జరిగింది.
అటు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ, తమ జట్టు అగ్రశ్రేణి జట్లపై ఇటువంటి స్కోర్‌లను విజయవంతంగా ఛేజింగ్ చేయడం ప్రారంభించాలని అన్నాడు. "మేము ఇక్కడి పిచ్‌ను చూసి 170-180తో ఛేజ్ చేయగలమని భావించాం. కానీ, అది సాధ్యపడలేదు. పెద్ద జట్లపై మేము అలాంటి స్కోర్‌లను ఛేజ్ చేయవలసి ఉంటుంది. అప్పుడే జట్టు సత్తా ఏంటో తెలుస్తుంది" అని చెప్పాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో రషీద్ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన పట్ల అతను సంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం కారణంగా శస్త్ర చికిత్స తర్వాత అంతర్జాతీయ మ్యాచులో ఇలాంటి ప్రదర్శన చేయడం బాగుందన్నాడు.
ఇక 28 బంతుల్లో 53 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత ప్రదర్శనకు ప్రాక్టీస్, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌పై మనస్సులోని స్పష్టత కారణమని పేర్కొన్నాడు. తాను ఏమి చేయాలనుకుంటున్నానో అది తన మనస్సులో స్పష్టంగా ఉంటుందన్నాడు.