KTR: తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
- తమిళనాడులోని కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘటన
- 38 మంది మృత్యువాత
- ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్
ఇటీవల తమిళనాడులో కల్తీ మద్యం తాగి దాదాపు 38 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రత్యేక ట్వీట్ చేశారు. "తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం చౌకైన మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడదని భావిస్తున్నా" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలాఉంటే.. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ నాటు సారా తాగి 38 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలామంది అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు నాటు సారా తాగి అస్వస్థతకు గురయ్యారు. అయితే వారిలో చికిత్స పొందుతూ 38 మంది మృతిచెందారు. మొత్తం 92 మంది కల్తీ సారా తాగినట్లు గుర్తించారు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.