Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కలిసొచ్చిన 21.. జనసేనానికి నేడు చిరస్మరణీయ రోజు
- అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన
- పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం
- 21 మంది ఎమ్మెల్యేలతో జూన్ 21న అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్
- వైరల్ చేస్తున్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. 21 అంకెకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసిన జనసేనాని తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనకు 21 సీట్లు కేటాయించారు. పవన్‌కు 21 సీట్లు మాత్రమే ఇవ్వడంపై వైసీపీ తీవ్రంగా హేళన చేసింది. అంత అని, ఇంత అని చివరికి 21 సీట్లకు చంద్రబాబు వద్ద పవన్ లొంగిపోయారని ట్రోల్ చేశారు. అయినప్పటికీ పవన్ వెనక్కి తగ్గలేదు. తాను 21 సీట్లకు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో కూడా వివరించారు. అదే విషయం పార్టీ నేతలకు చెప్పి ఒప్పించారు.
కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో మరే పార్టీ సాధించని ఘనతను పవన్ సొంతం చేసుకున్నారు. అసెంబ్లీకి పోటీ చేసిన 21 స్థానాలతోపాటు, పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాలను కూడా గెలుచుకుని వందకు వందశాతం విజయం సాధించారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ గేట్లు కూడా పవన్‌ను తాకనివ్వబోమని వైసీపీ నేతలు ప్రచారం చేసిన వేళ 21వ తేదీనాడు, 21 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో 21వ నంబర్‌కు పవన్‌కు ఏదో అవినాభావ సంబంధం ఉందంటూ జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.