Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం
- ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం
- స్పీకర్ పదవికి ఒకే నామినేషన్
- రేపు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్నపాత్రుడు!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకేఒక నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అసెంబ్లీ సమావేశాల రెండో రోజున అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇవాళ, అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతల్లో అయ్యన్న ఒకరు. 1983లో మొదటిసారి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. గతంలో మంత్రిగానూ వ్యవహరించారు.