Pakistan: పాకిస్థాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. కెప్టెన్ బాబర్‌కు బహుమతిగా కారు?
- పాక్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ తీవ్ర ఆరోపణలు
- తమకు ఎలాంటి సందేహాలు లేవన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్
- నిరాధార వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో పేలవమైన ప్రదర్శన చేసి లీగ్ దశ నుంచి నిష్ర్కమించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ముబాషిర్ లుక్మాన్ అనే ఓ సీనియర్ జర్నలిస్టు కెప్టెన్ బాబర్ ఆజమ్, సహా జట్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కెప్టెన్ బాబర్‌కు ఖరీదైన కారు బహుమతిగా అందిందని ఆరోపించారు.
గత ఏడాది చివరిలో బాబర్‌కు అతడి అన్నయ్య అత్యంత ఖరీదైన ఆడీ ఈ-ట్రాన్ జీటీ కారుని బహుమతిగా ఇచ్చాడని, పాక్ కరెన్సీలో ఈ కారు విలువ రూ.7-8 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నాడు. అంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చిన బాబర్ అన్నయ్య ఏం చేస్తాడా అనే అన్వేషించానని, అతడు ఏమీ చేయడని గుర్తించి ఆశ్చర్యపోయానని జర్నలిస్ట్ ముబాషిర్ పేర్కొన్నారు.
‘‘చిన్న జట్లపై ఓడిపోయినప్పుడు ప్లాట్లు, కార్లు రావని.. ఆ సమయంలో ఎవరిస్తారని ఓ వ్యక్తి నాతో అన్నారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు అని నేను పేర్కొనగా ఎవరేం చేస్తున్నారో అందరికీ తెలుసు అని అతడు బదులిచ్చాడు’’ అని జర్నలిస్ట్ ముబాషిర్ లుక్మాన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకంపనలు రేపుతున్నాయి.
స్పందించిన పీసీబీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది. ఫిక్సింగ్ ఆరోపణలు చేసేవారు ఆధారాలు చూపించాలని పేర్కొంది. ఎలాంటి రుజువు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీ వర్గాలు హెచ్చరించాయి. సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న విషయంపై తమకు అవగాహన ఉందని, పరిమితికి లోబడే విమర్శలు చేయాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే ఫిక్సింగ్ ఆరోపణలు నిరాధారమని, ఇలాంటి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, ఇలాంటి ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని అన్నారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై పీసీబీకి ఎలాంటి సందేహాలు లేవని, అలాంటప్పుడు ఎందుకు విచారణ చేపట్టాలి? అని ఆ అధికారి ప్రశ్నించారు.