Revanth Reddy: రుణమాఫీ, రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy announcement on Loan waiver and rythu bharosa
  • రాహుల్ గాంధీ రుణమాఫీపై మాట ఇచ్చారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి
  • కటాఫ్ తేదీ డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023గా నిర్ణయించినట్లు వెల్లడి
  • రైతుభరోసా విధివిధానాలకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినట్లు చెప్పిన సీఎం
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చారని... ఆ ప్రకారం రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఇస్తానన్న సోనియాగాంధీ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. మే 6, 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు.

డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించి రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలను కూడా మున్ముందు మాఫీ చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేస్తున్నామన్నారు. కానీ కేసీఆర్ తన పదేళ్ల కాలంలో ఎన్నో హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాలను తాము సేకరించామన్నారు.

నిధులు సేకరించి రైతులకు రుణవిముక్తి కల్పిస్తామని చెప్పరు. రైతు భరోసా పథకాన్ని కూడా పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ సంఘాన్ని రూపొందించినట్లు చెప్పారు. జులై 15వ తేదీ నాటికి మంత్రివర్గం ఉపసంఘం నివేదికను ఇస్తుందని తెలిపారు. పరిపాలనకు సంబంధించి మంత్రులు శ్రీధర్ బాబు, తదితరులు ఎప్పుడైనా వివరాలు అందిస్తారన్నారు.
Revanth Reddy
Congress
Loan Waiver
Rythu Bharosa

More Telugu News