Donald Trump: డొనాల్డ్ ట్రంప్ యూ-టర్న్.. ఇమ్మిగ్రేషన్‌పై కీలక వ్యాఖ్యలు
- అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్‌కార్డులు అందజేస్తామన్న ట్రంప్
- భారత్, చైనా విద్యార్థులు ‘సూపర్‌బ్రైట్’ స్టూడెంట్స్ అని వ్యాఖ్యానించిన మాజీ అధ్యక్షుడు
- నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విదేశీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసిన ట్రంప్
అమెరికా ఇమ్మిగ్రేషన్ సమస్యల విషయంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూ-టర్న్ తీసుకున్నారు. అమెరికా కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే విదేశీ విద్యార్థులకు ‘ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్‌లు’ అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత్, చైనా విద్యార్థులను ఉద్దేశిస్తూ అత్యంత తెలివైన వారు అని ట్రంప్ మెచ్చుకున్నారు. టాప్ అమెరికన్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మల్టీ బిలియనీర్లుగా మారుతుంటారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇమ్మిగ్రేషన్ విధానంపై కఠినంగా ఉంటానంటూ గతంలో కొన్ని వందల సార్లు చెప్పిన ట్రంప్ ఈసారి స్వరం మార్చడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. విదేశీ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం లక్షలాది మందికి అమెరికా పౌరసత్వం ఇవ్వబోతోందంటూ ఇటీవలే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బైడెన్‌కు పోటీగా ట్రంప్ తాజా ప్రకటన చేశారు. అయితే మెరిట్ ఆధారంగానే చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మద్దతు ఇస్తామని ట్రంప్ క్లారిటీగా చెబుతున్నారు.
‘‘మీరు (విదేశీ విద్యార్థులు) కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఆటోమేటిక్‌గా గ్రీన్ కార్డ్ పొందాలని నేను భావిస్తున్నాను. ఈ దేశంలో నివసిచడానికి మీరు గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్నాను. ఈ జాబితాలో చిన్న కాలేజీలు కూడా ఉంటాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఆల్-ఇన్’ అనే పోడ్‌కాస్ట్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చమత్ పలిహపిటియా, జాసన్ కాలకానిస్, డేవిడ్ సాక్స్, డేవిడ్ ఫ్రైడ్‌బర్గ్ అనే నలుగురు వెంచర్ క్యాపిటలిస్టులు ఈ పోడ్‌క్యాస్ట్‌ని హోస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వలసదారులు ఉన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ, తెలివైన విద్యార్థులను అమెరికాకు రప్పించడానికి మీరు ఏం హామీ ఇస్తారని ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.