Somireddy Chandra Mohan Reddy: జగన్ 'సింగిల్ డిజిట్' వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్
- వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు 'సింగిల్ డిజిట్' తప్పదన్న జగన్
- జగన్ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలనుకుంటున్నారన్న సోమిరెడ్డి
- జగన్ దోపిడీని గుర్తించిన ప్రజలు ఓటుతో తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్య
- జగన్ కోసం అక్రమాస్తుల కేసు సిద్ధంగా ఉందని వ్యంగ్యం
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.
ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్... నాశనం చేసే పని ఇంకా పూర్తి కాలేదని బాధపడిపోతున్నారని సోమిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. గత ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్న తీరును ప్రజలు గుర్తించారని, అందుకే ఓటుతో తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నించారని, కానీ ప్రజలు ఎన్నికల్లో దుష్ట సంహారం చేశారని వివరించారు. ఇప్పుడు జగన్ కోసం అక్రమాస్తుల కేసు సిద్ధంగా ఉందని, ఈ కేసు విచారణ కోసం కోర్టు మెట్లు ఎక్కేందుకు జగన్ కూడా సిద్ధంగా ఉండాలని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు.
మద్యం ద్వారా లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని... ల్యాండ్, మైనింగ్ మాఫియాతో వేల కోట్లు దోచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను మించి ఏపీలో దోపిడీ జరిగిందని అన్నారు.