T20 World Cup 2024: సూపర్-8లో వరుసగా రెండో విజయం.. ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన సౌతాఫ్రికా

Quinton De Kock and bowlers keep South Africa unbeaten run going
  • క్వింటన్ డికాక్ మెరుపులు
  • ఓ మాదిరి స్కోరును ఛేదించలేకపోయిన ఇంగ్లండ్
  • సెమీస్‌కు చేరువైన సఫారీ జట్టు
టీ20 ప్రపంచకప్‌ సూపర్-8లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లిష్ బ్యాటర్లు ఊది పడేస్తారునుకుంటే అనూహ్యంగా చతికిల పడ్డారు. 

20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలయ్యారు. హారీ బ్రూక్ 37 పరుగుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు, లియామ్ లివింగ్ స్టోన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జట్టులో వీరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. సఫారీ బౌలర్లలో రబడ, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు చక్కని ఆరంభం లభించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ మరోమారు బ్యాట్‌కు పనిచెప్పాడు. తొలుత ఆచితూచి ఆడిన అతడు.. ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టాడు. దొరికిన బంతిని దొరికినట్టు స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా దక్షిణఫ్రికా 63 పరుగులు చేసింది. అర్చర్ వేసిన నాలుగో ఓవర్‌లో డికాక్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు పిండుకున్నాడు. 

అతడి దూకుడు చూస్తే జట్టు స్కోరు 200 పరుగులు దాటుతుందని భావించారు. అయితే, అర్చర్ ప్రతీకారం తీర్చుకుని డికాక్‌ను పెవిలియన్ పంపాడు. మొత్తం 38బంతులు ఎదుర్కొన్న డికాక్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అతడు అవుటయ్యాక స్కోరు వేగం తగ్గింది. క్లాసెన్ (8), కెప్టెన్ మార్కరమ్ (1), మార్కో జాన్సన్ (0) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. డేవిడ్ మిల్లర్ మాత్రం క్రీజులో ఉన్నంతసేపు చెలరేగాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఓపెనర్ హెండ్రిక్స్ 19 పరుగులు చేశాడు. మొత్తంగా సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్‌కు మూడు వికెట్లు లభించాయి.

సూపర్-8లో వరుసగా రెండు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరువైంది. ప్రపంచకప్‌లో నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య సూపర్-8 పోరు జరగనుంది.
T20 World Cup 2024
Quinton De Kock
Team South Africa
Team England

More Telugu News