Chandrababu: ఆనాడు అసెంబ్లీలో తాను చేసిన శపథాన్ని రిపీట్ చేసి వినిపించిన సీఎం చంద్రబాబు
- ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు
- ఏకగ్రీవంగా అయ్యన్నపాత్రుడి నియామకం
- నేడు స్పీకర్ బాధ్యతలు చేపట్టిన సీనియర్ రాజకీయవేత్త
- కొత్త ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ శాసనసభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం దక్కింది. ఆయన తప్ప మరెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు పదవిని చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. అయ్యన్నపాత్రుడి గుణగణాలు, రాజకీయ జీవితం, ఆయన నేపథ్యం వివరించిన అనంతరం చంద్రబాబు... గత వైసీపీ పాలనలో ఇదే సభలో తాను ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను కొత్త ఎమ్మెల్యేలకు వివరించారు. ఎలా నడుచుకోవాలో శాసనసభ్యులకు నిర్దేశించారు.
"చట్టసభలకు వచ్చే అవకాశం కొన్ని లక్షల మందిలో ఒకరికి వస్తుంది. ఆ అవకాశంతోనే మనందరం ఇక్కడికి వచ్చాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే... మనల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలి, తాత్కాలికంగా ఏంచేయాలి, నిర్దిష్ట కాల వ్యవధిలో ఏం చేయగలం, దీర్ఘకాలంలో ఏం చేయగలం అని మనకు మనమే నిర్దేశించుకుని పనిచేయాలి.
ఇక్కడున్న ఎమ్మెల్యేందరికీ ఒకటే చెబుతున్నా... మనందరిపై ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు, చర్చలను రాష్ట్రమంతటా గమనిస్తుంటారు. కేవలం విపక్షాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడొద్దు. మనం రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఒక శాసనసభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడలేని గౌరవం వస్తుంది. ఆ దిశగా మనందరం కృషి చేయాలి.
కానీ ఒక్కోసారి బాధ కలుగుతుంది. గడచిన ఐదేళ్లలో చూస్తే... ఏ విధంగా చూసినా స్ఫూర్తికి భిన్నంగా శాసనసభ నడిచింది. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని వికృత పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి వేదికగా మార్చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, వెక్కిరింపులు, కక్ష సాధింపులు, మైక్ ఇవ్వకుండా పోవడం వంటి ఘటనలు జరిగాయి.
మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలను వెక్కిరించడం, బూతులు తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం జరిగాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారిపై సభలోనే దాడి చేసే పరిస్థితులు వచ్చాయి. నీచంగా మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. ఆ రోజు టీడీపీ నుంచి 23 మంది గెలిచాం. జనసేన, బీజేపీ వాళ్లు లేరు. మా 23 మంది ఎమ్మెల్యేలం ఇదే సభ వస్తే, మాతో అవతలి పక్షం వాళ్లు ప్రవర్తించిన తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది.
ఇదే సభలో నేను కూడా ఎంతో బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. నా గురించి, నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడితే... కనీసం స్పందించడానికి నాకు మైక్ ఇవ్వాలని అడిగాను. మేం నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే ఇవ్వలేదు. ఆ రోజే చెప్పాను... ఇది గౌరవ సభ కాదు అని. మీరు మైక్ ఇవ్వకపోయినా, రికార్డ్స్ కోసం స్టేట్ మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వెళతాను అని చెప్పాను. ఆనాడు ఏం చెప్పానో అదే ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను.
"నేను స్టేట్ మెంట్ ఇవ్వాలనుకున్నాను... మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధలేదు. మళ్లీ చెబుతున్నా... ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తాను తప్ప, అదర్ వైజ్ ఈ రాజకీయాలు నాకు అవసరం లేదు. ఇది ఒక కౌరవ సభ. గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను అని మరొక్కసారి చెబుతూ... మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా... నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా" అని చెప్పి, వాకౌట్ చేసి బయట మీడియా సమావేశం పెట్టాను.
ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే... నా జీవితంలో ఎమ్మెల్యే అవడం ఇది తొమ్మిదవ సారి. ఈ రాష్ట్రంలో, తెలుగుజాతిలో ఏ నాయకుడికి నాకు వచ్చినన్ని అవకాశాలు రాలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యాను. 15 ఏళ్లు విపక్ష నేతగా కొనసాగాను.
తిరుపతిలో నాపై దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్లు నాపై పేల్చారు. ఆ రోజు కూడా నా కళ్లలో నీళ్లు రాలేదు. కానీ ఎలాంటి సంబంధం లేని నా అర్ధాంగిపై ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో గౌరవంగా బతికే ఆడపడుచులు అందరినీ అవమానించారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేశారు. అలాంటి సంఘటనలు చూశాక మొదటిసారి నా జీవితంలో కన్నీళ్లు వచ్చాయి. ఆడబిడ్డల జీవితాలను ఇలా హననం చేస్తున్నారన్న బాధతో కంటతడి పెట్టాను.
ఆ రోజే అనుకున్నా... ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం అనుకున్నాను. ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి అనుకున్నాను. మళ్లీ ఈ రాష్ట్రంలో గౌరవ సభ నెలకొల్పి, హుందాగా నడిపించేంత వరకు నేను కృషి చేస్తాను అని ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు. 2021 నవంబరు 19న సభ నుంచి వెళ్లిపోయాను. మళ్లీ నిన్న మీ అందరి ఆశీస్సులతో, ప్రజలందరి ఆమోదంతో ఈ సభలో అడుగుపెట్టాను.
నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా చూసే బాధ్యతను ఈ అసెంబ్లీ స్వీకరించాలని కోరుతున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. మళ్లీ నాకు జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలన్నదే నా ఆకాంక్ష" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.