Suryakumar Yadav: ప్రపంచంలో బెస్ట్ బౌలర్ అతడేనన్న సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav described Afghan spinner Rashid Khan as the worlds best bowler
  • ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ వరల్డ్ బెస్ట్ బౌలర్ అని ప్రశంసించిన సూర్య
  • అతడిని డామినేట్ చేయడం సాధ్యం కాదని వ్యాఖ్య
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు స్వీకరించిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు
టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా విజయంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. రోహిత్, కోహ్లీ, పంత్ వంటి టాపార్డర్ ప్లేయర్ విఫలమైన పిచ్‌పై 28 బంతుల్లో 53 పరుగులు బాది ప్రత్యర్థికి 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో సూర్య తన వంతు సహకారం అందించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అందుకున్న సూర్య అవార్డు ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్, ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ప్రపంచపు అత్యుత్తమ బౌలర్‌గా రషీద్ ఖాన్‌ను సూర్య అభివర్ణించాడు.

‘‘ఇంతకుముందూ చెప్పాను. మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షప్రసారంలో చెబుతున్నాను. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం. అయితే నేను క్రీజులో ఉన్నప్పుడు అతడి బౌలింగ్‌లో ఏ షాట్లు ఆడాలో నాకు తెలుసు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన రషీద్ ఖాన్‌పై ఒక బ్యాటర్‌గా ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదు. అయితే ఈ రోజు నేను మెరుగైన జట్టు వైపు ఉండడం సంతోషంగా ఉంది’’ అని సూర్య పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వేసిన 6 బంతులను ఎదుర్కొన్న సూర్య 16 పరుగులు బాదాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో తన వ్యక్తిగత ప్రదర్శనపై సూర్య మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన వెనుక కృషి, ప్రాక్టీస్ ఉన్నాయని చెప్పాడు. తాను మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఏం చేయాలనేదానిపై స్పష్టతతో ఉంటానని వివరించారు. కాగా 182 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Suryakumar Yadav
Rashid Khan
T20 World Cup 2024
Cricket
India vs Afhanistan

More Telugu News