YSRCP Building: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ కూల్చివేత టీడీపీ నాశనానికి నాంది: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri Appala Raju slams TDP leaders for demolition of YCP office in Tadepalli
  • తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత
  • మండిపడుతున్న వైసీపీ నేతలు
  • టీడీపీ నేతలు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారన్న సీదిరి అప్పలరాజు
  • ఈ కూల్చివేత ఏపీ చరిత్రలో మాయని మచ్చలా నిలిచిపోతుందని వ్యాఖ్యలు
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ భవనాలను అధికారులు కూల్చివేయడం పట్ల మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. తాడేపల్లిలోని తమ పార్టీ కార్యాలయాన్ని టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా, కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ కూల్చివేసిందని ఆరోపించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మాయని మచ్చలా  మిగిలిపోతుందని అన్నారు. 

"జగన్ కూడా గతంలో కూల్చారు కదా... మరి ఇప్పుడు కూల్చితే తప్పేంటి? అని కొందరు కుహనావాదులు అంటున్నారు. ఇలాంటి వాదనలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నాడు ఏదైతే ప్రజావేదికను కూల్చామో... అది నదీ గర్భంలో అక్రమంగా కట్టిన నిర్మాణం. చంద్రబాబు ఉంటున్న భవనం కూడా నదీ గర్భంలో అక్రమంగా కట్టినదే. చంద్రబాబు హయాంలో అనేక నిర్మాణాలను నదీ గర్భంలో కట్టారు. వాటన్నింటిపైనా కోర్టుల్లో విచారణ జరిగింది. కోర్టులు చెప్పడంతో వాళ్లకు అడ్డుకట్ట పడింది. 

మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం కూడా ఓ కాలువపై కట్టారు. ఇవాళ కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ కూల్చివేతలకు పాల్పడతారా? ఇక రాజ్యాంగంతో పని లేదా? న్యాయస్థానాలతో పని లేదా? మీరు ఏది అనుకుంటే అది చేస్తారా? ఇవాళ తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ కూల్చివేత టీడీపీ నాశనానికి నాంది పలుకుతుంది. 

గత మూడు వారాలుగా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడుతున్నారు. గ్రామాల్లోని సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను, హెల్త్ క్లినిక్ లను ధ్వంసం చేస్తున్నారు. శిలాఫలకాలను, వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రోడ్లను సైతం తవ్వేస్తున్నారు. వ్యక్తుల మీద భౌతికంగా దాడులు చేస్తున్నారు. మేం ఓపిక పడతాం. 

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 2019లో మిమ్మల్ని నేలమట్టం చేసి మాకు ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. ఈసారి మమ్మల్ని కాదనుకుని మరింత పెద్ద ఎత్తున మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మన ప్రవర్తనను బట్టి ప్రజల తీర్పులు కూడా మారుతూ ఉంటాయి. ఇవాళ వైసీపీ కార్యాలయ కూల్చివేత ద్వారా టీడీపీ పతనానికి వాళ్లే శ్రీకారం చుట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మేధావులు, ప్రతి ఒక్క విద్యావంతుడు దీనిపై స్పందించాలని కోరుతున్నా" అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.
YSRCP Building
Seediri Appala Raju
Tadepalli
YSRCP
TDP

More Telugu News