Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ను చాలామంది అపార్థం చేసుకున్నారు: అశ్విన్
- టీమిండియా కోచ్ రేసులో ముందున్న గౌతమ్ గంభీర్
- గంభీర్ ఒక ఫైటర్ అంటూ కొనియాడిన రవిచంద్రన్ అశ్విన్
- టీమిండియా కొత్త కోచ్ ఎవరో ఇప్పుడే చెప్పలేనని వెల్లడి
టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు గౌతమ్ గంభీర్. భారత పురుషుల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇంటర్వ్యూ చేస్తున్న ఇద్దరిలో ఒకరు గౌతమ్ గంభీర్ కాగా, మరొకరు డబ్ల్యూవీ రామన్. ఇప్పటికే ఇంటర్వ్యూలో ఒక రౌండ్ పూర్తయింది.
గంభీర్, రామన్... ఇద్దరూ కూడా భారత మాజీ క్రికెటర్లే. టీమిండియా ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ టీ20 వరల్డ్ కప్ తర్వాత పదవిలో కొనసాగేందుకు ఇష్టపడడం లేదు. ద్రావిడ్ వారసుడిగా గంభీర్ నియామకం దాదాపు ఖరారైనట్టే. సాధారణ ప్రక్రియలో భాగంగానే గంభీర్ తో పాటు రామన్ ను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు తప్ప... బీసీసీఐ వర్గాలు గంభీర్ ను టీమిండియా హెడ్ కోచ్ గా ఎప్పుడో ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
అటు, టీమిండియా వర్గాల నుంచి కూడా గంభీర్ కు మద్దతు లభిస్తోంది. తాజాగా, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్... గంభీర్ ను ఆకాశానికెత్తేశాడు. గంభీర్ ఒక పోరాట యోధుడు అని అభివర్ణించాడు. అయితే అతడిని చాలామంది అపార్థం చేసుకున్నారని తెలిపాడు. తనలో ఆత్మవిశ్వాసం పెరగడంలో గంభీర్ పాత్ర ఉందని అన్నాడు. తాను 2011 వరల్డ్ కప్ కు ముందే టీమిండియాకు ఎంపికైనప్పటికీ, రెండేళ్ల పాటు జట్టులో డ్రింక్స్ అందించడానికే పరిమితం అయ్యానని అశ్విన్ వెల్లడించాడు.
"కెరీర్ ఆరంభంలో నన్ను గంభీర్ ఎంతగానో ప్రోత్సహించాడు. తమిళనాడు నుంచి జాతీయ జట్టులోకి వచ్చిన ఇతర క్రికెటర్లు కూడా నాలో అంత నమ్మకం కలిగించలేకపోయారు. ఆట పట్ల గంభీర్ పరిజ్ఞానం అత్యుత్తమం అని చెప్పాలి. ఆటలో దిగితే విజయం కోసం చివరి వరకు పోరాడతాడు. భారత క్రికెట్లో ఉన్న దురదృష్టం ఏంటంటే... కొందరినే హీరోలుగా చూస్తాం... మిగతావాళ్లు ఎంత శ్రమించినా వాళ్ల గురించి పట్టించుకోం. గంభీర్ పై నాకు అపారమైన గౌరవం ఉంది. ఇక టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్నది ఇప్పుడే చెప్పలేను" అంటూ అశ్విన్ పేర్కొన్నాడు.