Afghanistan players: వెస్టిండీస్‌లో ‘హలాల్ మాంసం’ దొరక్క ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల పడరాని పాట్లు

Afghanistan players cooked their own meals in Barbados as unavailability of halal meat in their team hotel
  • బస చేసిన హోటల్‌లో స్వయంగా వండుకుంటున్న ప్లేయర్లు
  • హలాల్ మాంసం లభించకపోవడంతో చెఫ్‌ల అవతారం ఎత్తిన ఆటగాళ్లు
  • విమాన సర్వీసుల విషయంలోనూ తిప్పలేనంటున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు
టీ20 వరల్డ్ కప్ 2024 లీగ్ దశలో అద్భుతంగా రాణించి.. ప్రస్తుతం సూపర్-8 దశ ఆడుతున్న ఆఫ్ఘనిస్థాన్‌ ఆటగాళ్లకు ఆతిథ్య వెస్టిండీస్‌లో ఊహించని ఇబ్బంది ఎదురైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో బస చేస్తున్న హోటల్‌లో ‘హలాల్ మాంసం’ అందుబాటులో లేకపోవడంతో ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారంలో భాగంగా మాంసాన్ని తప్పనిసరిగా తీసుకునే అలవాటు ఉండడంతో తెగ ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆటగాళ్లే స్వయంగా వంట మాస్టర్లుగా మారిపోయారు. చెఫ్‌లుగా మారి హోటల్‌లో స్వయంగా ఆహారాన్ని వండుకున్నారు. ఈ విషయాన్ని ఓ ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు ఓ జాతీయ మీడియా సంస్థకు వెల్లడించాడు. 

తాము బస చేస్తున్న హోటల్‌లో హలాల్ మాంసం అందుబాటులో లేదని, స్వయంగా వండుకోవడం లేదా బయటకు వెళ్లి తినడం తప్ప వేరే మార్గం లేదని, అందుకే వండుకున్నామని వివరించాడు. కాగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ చక్కటి ఆతిథ్యం ఇచ్చిందని, అయితే కరేబియన్ దేశం వెస్టిండీస్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సదరు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు పేర్కొన్నాడు. తాము బస చేసిన బ్రిడ్జ్‌టౌన్ హోటల్‌లో లభించే మాంసం హలాల్ చేసినదో కాదో క్లారిటీ లేదని ఆటగాడు పేర్కొన్నాడు.

కరేబియన్ ద్వీపంలో హలాల్ మాంసం అందుబాటులో ఉందని, అయితే అన్ని హోటళ్లు, రెస్టారెంట్ల మెనూలో ఉందో లేదో స్పష్టంగా తెలియదని, తాము బస చేసిన హోటల్‌లో మాత్రం దొరకదని ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు వివరించాడు. కొన్నిసార్లు సొంతంగా వండుకుంటామని, కొన్నిసార్లు బయటకు వెళ్తామని వివరించాడు. వెస్టిండీస్‌లో హలాల్ బీఫ్ సమస్య ఉందని పేర్కొన్నాడు.

కాగా వెస్టిండీస్‌లో లాజిస్టిక్ సమస్య కూడా ఉందని మరో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు వాపోయాడు. షెడ్యూల్ ప్రకారం సన్నద్ధతపై రవాణా సమస్యలు ప్రభావం చూపుతున్నాయని, విమాన సర్వీసులకు సంబంధించిన సమస్య ఉందని, చివరి నిమిషంలో తెలియజేస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నారని ఒక ఆటగాడు పేర్కొన్నాడు.
Afghanistan players
Afghanistan
Cricket
T20 World Cup 2024
Team West Indies

More Telugu News