Central Government: ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు
- వారంటీ గురించి సమగ్ర వివరాలు వినియోగదారులకు స్పష్టంగా చెప్పాలన్న కేంద్ర ప్రభుత్వం
- అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని సూచన
- వారెంటీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు
ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడే వారెంటీకి సంబంధించిన పూర్తి వివరాలను వినియోగదారులకు స్పష్టంగా చెప్పాలని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. వారెంటీ వ్యవధి ప్రారంభం తేదీని యూజర్లకు తెలియజేయాలని, వారెంటీ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలను భారత్‌లో అనుసరించాలని తయారీ కంపెనీలను కోరింది. వస్తువుని కొనుగోలు చేయడానికి ముందే దానికి సంబంధించిన వారెంటీ వివరాలను తెలియజేయాలని, వస్తువుని కొన్న తర్వాత చెప్పొద్దని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) శనివారం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయింది.
తయారీ కంపెనీలు రూపొందించిన విధానాల ప్రకారం వారెంటీ వ్యవధి.. వస్తువు కొనుగోలు చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ప్రొడక్ట్ ఇన్‌స్టాలేషన్ తేదీ నుంచి కాదని సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే గుర్తుచేశారు. అయితే, వినియోగదారులు వస్తువుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రమే దానిని ఉపయోగించడం మొదలవుతుందని, కాబట్టి వారెంటీ వ్యవధిలో తేడా ఉంటుందని అన్నారు. వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత, పరిమాణం, పనితీరు, నాణ్యత, ప్రమాణాలు, ధరల గురించి తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని పేర్కొన్నారు. అన్ని కంపెనీలు తమ అభిప్రాయాలను 15 రోజుల్లోగా తెలియజేయాలని ఆయన కోరారు.
వారంటీ వ్యవధికి సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులను సత్వరం, చురుగ్గా పరిష్కరించాలని సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎల్‌జీ, పానాసోనిక్, హాయర్, క్రోమా, బాష్ కంపెనీలతోపాటు పలు ప్రధాన ఎలక్ట్రానిక్స్ వస్తువుల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.