Kasu Mahesh Reddy: చంద్రబాబు విజయానికి కారణం అదే: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి

Kasu Mahesh Reddy opines on YCP disastrous elections resutls
  • ఇటీవల ఎన్నికల్లో  వైసీపీ ఘోర పరాజయం
  • తమ పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషించిన గురజాల మాజీ ఎమ్మెల్యే
  • చంద్రబాబును అరెస్ట్ చేశారని వెల్లడి
  • తమ పార్టీలోని కొందరు నేతలు బూతులు తిట్టారని వ్యాఖ్యలు
  • ఇలాంటి అవమానాలు చంద్రబాబులో, టీడీపీలో కసిని పెంచాయని స్పష్టీకరణ
ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన వారిలో కాసు మహేశ్ రెడ్డి కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కాసు మహేశ్ రెడ్డి... ఓటమిపాలయ్యారు. తాజాగా ఆయన ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. 

వైసీపీలోని కొందరు నేతలు నోటికొచ్చినట్టు తిట్టి, ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని కాసు మహేశ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు బూతులు తిట్టారని, పైగా చంద్రబాబును అరెస్ట్  చేయడం జరిగిందని... అలాంటి అవమానాలు చంద్రబాబులోనూ, టీడీపీ నేతల్లోనూ కసి పెంచాయని అన్నారు.  

ఎవరినైనా అవమానాలకు గురిచేస్తే వారు కసితో రగిలిపోయి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోందని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు విషయంలో జరిగింది అదేనని కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు. రామాయణ, మహాభారత పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయని, జగన్ కూడా ఇప్పుడు అదే కసితో పనిచేయాలని అన్నారు. 

తక్కువ స్థాయి మద్యం బ్రాండ్లు కూడా వైసీపీ ఓటమికి దారితీశాయని, మద్యం తాగేవారు తమ పార్టీకి ఓటేయలేదని చెప్పారు. రాష్ట్రంలో మద్యం పాలసీ మార్చాలని సజ్జలకు, విజయసాయిరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని వివరించారు. 

రాష్ట్రంలో పాతికశాతం మందుబాబులు ఉంటారని, వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని తెలిపారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని టీడీపీ చేసిన ప్రచారం మందబాబులపై బాగా ప్రభావం చూపిందని పేర్కొన్నారు. 

ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేదలపైనా, ఇతర వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపాయని అన్నారు.
Kasu Mahesh Reddy
YSRCP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News