NEET-2024: 'నీట్' అవకతవకలపై క్రిమినల్ కేసు నమోదు చేసిన సీబీఐ
- ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు
- దేశవ్యాప్తంగా దుమారం
- నీట్ రద్దు చేయాలని డిమాండ్లు
- కేంద్రం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ
నీట్ యూజీ ఎంట్రన్స్-2024 పరీక్ష పేపరు లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ లోనే ఇలాంటి అక్రమాలు జరగడం ఏంటని కేంద్రంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షకు ఒక్క రోజు ముందు పేపర్ లీకైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నీట్ రద్దు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ అవకతవకలపై నేడు కేసు నమోదు చేసింది. కేంద్ర ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు సీబీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిర్యాదిదారులు పేర్కొన్న ఆరోపణలను ఎఫ్ఐఆర్ లో పొందుపరిచామని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తామని వివరించింది.
"నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2024 మే 5న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించింది. 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నీట్ పరీక్ష చేపట్టారు. విదేశాల్లోని 14 నగరాల్లోనూ నీట్ పరీక్ష జరిగింది. నీట్ పరీక్షకు ఈ ఏడాది 23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. నీట్ పరీక్ష సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో పలు సంఘటనలు జరిగినట్టు మాకు ఫిర్యాదు అందింది.
ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర విద్యాశాఖ మమ్మల్ని కోరింది. కుట్ర, మోసం, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం, అవిశ్వాసం... కొందరు విద్యార్థులు, విద్యాసంస్థలు ఆధారాలు ధ్వంసం చేయడం, మధ్యవర్తులు... తదితర అక్రమాలపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు, ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపైనా దర్యాప్తు జరపాలని కేంద్రం కోరింది.
ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. నీట్ అక్రమాలపై కేసులు నమోదైన పాట్నా, గోధ్రా ప్రాంతాలకు మా బృందాలను పంపిస్తున్నాం" అని సీబీఐ తన ప్రకటనలో వెల్లడించింది.