Allu Aravind: తాము డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఎందుకు కలిశామో చెప్పిన అల్లు అరవింద్

Allu Aravind talks to media after meeting Pawan Kalyan
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో నిర్మాతల సమావేశం
  • పవన్ తో సమావేశం ఉల్లాసంగా సాగిందన్న అల్లు అరవింద్
  • సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం వచ్చామని వెల్లడి
  • ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చి  చంద్రబాబును, పవన్ ను అభినందిస్తామని వివరణ
తెలుగు సినీ నిర్మాతలు నేడు విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ముగిసిన అనంతరం సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశం ఉల్లాసంగా సాగిందని వెల్లడించారు. 

"ఈ రోజు మా అందరికీ సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కల్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాం. ఈ సమావేశంలో మేం కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా... సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అభినందించడానికి ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించమని అడిగాం. సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ లభిస్తే... ఇండస్ట్రీలో వివిధ విభాగాల వాళ్లందరం తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను అభినందిస్తాం. తప్పకుండా సీఎం అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. నేడు పవన్ తో సమావేశం చాలా సంతోషకరమైన వాతావరణంలో సాగింది" అని అల్లు అరవింద్ తెలిపారు. 

ఇది కాక ఇతర విషయాలేమైనా చర్చించారా? అన్న ప్రశ్నకు ఆల్లు అరవింద్ ఆసక్తికరంగా బదులిచ్చారు. ఇండస్ట్రీ సమస్యల గురించి ఈ సమావేశంలో ఎలాంటి ప్రస్తావన రాలేదని, టికెట్ ధరల పెంపు అనేది చాలా చిన్న విషయం అని వ్యాఖ్యానించారు. 

చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో మాట్లాడుకున్నప్పటికీ, ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందం కలిసినప్పుడు అన్ని విషయాలు చెబుతామని అన్నారు.
Allu Aravind
Pawan Kalyan
Producers
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News