T20 World Cup 2024: సెయింట్ లూసియాలో జోరుగా వాన... భారత్-ఆసీస్ మ్యాచ్ జరిగేనా?
- నేడు టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా × ఆస్ట్రేలియా
- సెయింట్ లూసియా వేదికగా మ్యాచ్
- గత రాత్రి నుంచి సెయింట్ లూసియాలో వర్షాలు
టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ అత్యంత కీలక మ్యాచ్ జరగనుంది. సూపర్-8 దశ గ్రూప్-1లో నేడు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆసీస్ కు చావోరేవో వంటిది. ఇందులో ఓడితే ఆసీస్ సెమీస్ ఆశలు దాదాపు అడుగంటిపోతాయి.
అయితే, ఈ మ్యాచ్ కు వేదికైన సెయింట్ లూసియాలో భారీ వర్షం కురుస్తోంది. మరి కొన్ని గంటల్లో మ్యాచ్ జరగాల్సి ఉండగా, జోరుగా వాన కురుస్తుండడంతో, మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. గత రాత్రి కూడా ఇక్కడ భారీ వర్షం పడడం గమనార్హం.
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు ఉంటాయి. ఇదే గ్రూప్ లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతే... అప్పుడు ఆసీస్ సెమీస్ చేరుతుంది.
అలాకాకుండా... బంగ్లాదేశ్ పై ఆఫ్ఘన్ గెలిస్తే ఆసీస్ ఇంటిదారి పడుతుంది. టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.