Jeevan Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికతో మనస్తాపానికి గురయ్యా... భవిష్యత్తును కాలం నిర్ణయిస్తుంది: జీవన్ రెడ్డి
- పార్టీ నియమ నిబంధనలను పాటిస్తానని జీవన్ రెడ్డి హామీ
- సంజయ్ చేరికపై జగిత్యాల కార్యకర్తల మనోభావాలు పట్టించుకోలేదని ఆవేదన
- జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారన్న శ్రీధర్ బాబు
- ఖర్గే, రేవంత్, వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ
కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని... ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ వీడుతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసానికి చేరుకొని బుజ్జగించారు.
అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పార్టీ నియమ నిబంధనలను పాటిస్తానన్నారు. కానీ సంజయ్ చేరికపై కార్యకర్తల మనోభావాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం పార్టీ కోసమే పని చేశానని... కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.
ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో లేం: శ్రీధర్ బాబు
జీవన్ రెడ్డి ఎల్లప్పుడూ పార్టీ కోసమే పని చేశారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన... కాంగ్రెస్ పక్షానే నిలబడ్డారన్నారు. కానీ నిన్నటి ఘటనతో ఆయన మనస్తాపానికి గురయ్యారన్నారు. ఈ విషయం తెలియగానే ఇక్కడకు వచ్చి చర్చలు జరిపినట్లు చెప్పారు. ఆయన అసంతృప్తిని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళతామన్నారు.
జగిత్యాల కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. 40 ఏళ్లుగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన... అలాగే ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన కఠిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారన్నారు. జీవన్ రెడ్డి చాలా పెద్ద నాయకుడని... అలాంటి వారికి హామీ ఇచ్చే స్థాయిలో తాము లేమన్నారు. కానీ వారు అధైర్యపడవద్దని మాత్రం కోరుతున్నామన్నారు.