Virat Kohli: విరాట్ కోహ్లీ వైఫల్యంపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- క్రీజ్ బయటకు వస్తే బ్యాలెన్స్‌తో ఆడాలన్న మాజీ దిగ్గజం
- ఔట్ అయిన షాట్లను గమనిస్తే బ్యాలెన్స్ లేదని స్పష్టమవుతోందని విశ్లేషణ
- టీ20 వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమవుతున్న విరాట్
- ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 4, 0, 24, 37, 0 చొప్పున పరుగులు
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన అతడు ఓపెనర్‌గా వచ్చి వరుసగా 1, 4, 0, 24, 37, 0 చొప్పున పరుగులు చేశాడు. ఎంత దారుణంగా విఫలమయ్యాడో ఈ స్కోర్లను బట్టి చెప్పేయవచ్చు. ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో విరాట్ ప్రదర్శన పట్ల టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు భారత అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో రాణించలేకపోయినా వెస్టిండీస్ వేదికగా జరిగే కీలక మ్యాచ్‌ల్లో రాణిస్తాడని ఆశించినప్పటికీ అతడి ప్రదర్శన మెరుగుపడలేదు. దీంతో విరాట్ ప్రదర్శనపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీ క్రీజ్ బయటకు వచ్చి ఆడేటప్పుడు అతడి బ్యాలెన్స్ మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అతడు ఔట్ అయిన షాట్లను గమనిస్తే ఇది స్పష్టమవుతోందని అన్నారు. ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ బ్యాలెన్స్ సరిగ్గా లేదని అన్నారు. ఔట్ షాట్‌లలో అతడి బ్యాలెన్స్ బాగోలేదని అన్నారు. కోహ్లీ పిచ్‌పై మరింత సమయం గడిపితే అతడి విశ్వాసం మరింత పెరుగుతుందని సునీల్ గవాస్కర్ సూచించారు. ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మేరకు గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో 37 పరుగులతో క్రీజులో సెట్ అయినట్టే కనిపించాడని, కానీ టాంజిమ్ హసన్ సాకిబ్ వేసిన స్లో డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడని గవాస్కర్ ప్రస్తావించారు. క్రీజ్ బయటకు వచ్చి ఆడాలని కోహ్లీ భావించాడని, బ్యాలెన్స్ లేక ఔట్ అయ్యాడని విశ్లేషించారు.