Telugudesam: టీడీపీ-జనసేనను విడదీసేందుకు జగన్ కుట్ర.. ఇదిగో సాక్ష్యం.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు: టీడీపీ

TDP alleged YCP plans to break TDP Janasena alliance
  • ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టే నీచపు బుద్ధి జగన్‌కే సొంతమన్న టీడీపీ
  • ‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టీకరణ
  • ‘ఐప్యాక్’తో పెట్టించి ఎన్నికలకు ముందునుంచీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు వైసీపీ పెద్ద కుట్రకు తెరలేపిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. జగన్‌రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న సోషల్ మీడియా పేజీలు, చానళ్లు పవన్ కల్యాణ్‌పై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. టీడీపీకి అనుకూలం అని నమ్మించేలా ‘యువగళం’ అనే యూట్యూబ్ చానల్‌ను ‘ఐప్యాక్’తో పెట్టించి, చంద్రబాబును తిడుతూ వీడియోలు పెట్టించారని పేర్కొంది. ఇప్పుడు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఫేక్ వీడియోలు పోస్టు చేసి రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించే పెద్ద కుట్రకు తెరలేపారని వివరించింది. 

యువగళం అనే యూట్యూబ్ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చింది. ఇరు పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినీ అభిమానుల మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి ఈ దేశంలో జగన్ ఒక్కడికే ఉందని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని కోరింది. ఇలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.
Telugudesam
Janasena
YSRCP
Yuvagalam Channel
Andhra Pradesh
YS Jagan

More Telugu News