Julian Assange: నేరాంగీకారానికి అమెరికాతో జూలియన్ అసాంజే ఒప్పందం.. యూకే జైలు నుంచి విడుదల
- వికీలీక్స్ వ్యవస్థాపకుడి కేసులో చాలా కాలం తర్వాత కదలిక
- అదనపు జైలుశిక్ష విధించబోమని హామీ ఇచ్చిన అమెరికా
- బ్రిటన్ జైలు నుంచి విడుదలైన అసాంజే
- రేపు అమెరికా ఫెడరల్ కోర్టు ముందు హాజరు
- విచారణ అనంతరం స్వదేశం ఆస్ట్రేలియాకు పయనం
అమెరికా మిలిటరీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని లీక్ చేసి గూఢచర్యం చట్టాలను ఉల్లంఘించారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించనుంది. అదనపు జైలుశిక్ష నుంచి తనకు విముక్తి కల్పిస్తానంటే నేరాన్ని అంగీకరిస్తానంటూ అమెరికా కోర్టుతో అసాంజే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అమెరికా ఆమోదం లభించింది. దీంతో పశ్చిమ పసిఫిక్‌లోని యూఎస్ కామన్వెల్త్ మరియానా ఐలాండ్స్‌లోని ఫెడరల్ కోర్టు ముందు బుధవారం అసాంజే హాజరు కానున్నారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన పత్రాలు సోమవారం వెల్లడయ్యాయి.
గత ఐదేళ్లుగా బ్రిటన్ కస్టడీలో ఉన్న అసాంజే మంగళవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి అమెరికా బయలుదేరారు. బుధవారం నాడు అమెరికా కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కోర్టు విచారణ తర్వాత తన సొంత దేశం ఆస్ట్రేలియాకు ఆయన తిరిగి వెళ్లిపోనున్నారు. అమెరికా గూఢచర్యం చట్టాల ఉల్లంఘన కింద అతడికి 62 నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అయితే బ్రిటన్‌లో ఇప్పటికే 5 ఏళ్ల జైలుశిక్ష పూర్తవడం, అదనపు శిక్ష విధించబోమంటూ హామీ లభించడంతో ఆయన స్వేచ్ఛగా స్వదేశం ఆస్ట్రేలియా వెళ్లిపోనున్నారు. దీంతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు ఓ కొలిక్కి రానుంది.
కాగా తమ గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు వాటిని వ్యాప్తి చేశాడంటూ 2010 నుంచి అమెరికా ఆరోపిస్తోంది. అతడిని అమెరికా కోర్టు ముందు నిలబెట్టాలని అగ్రదేశం ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆ దేశ న్యాయపోరాటానికి పరిష్కారం లభించినట్టయింది.
కాగా విజిల్-బ్లోయింగ్ వెబ్‌సైట్ వికీలీక్స్ అధిపతిగా 2010 నుంచి వందల సంఖ్యలో అమెరికా రహస్య పత్రాలను జూలియన్ అసాంజే బహిర్గతం చేశారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలో జరిగిన యుద్ధాలకు సంబంధించిన అమెరికా సైనిక రహస్యాలను బహిర్గతం చేసినందుకు గానూ అసాంజేను విచారించాలని అమెరికా భావించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ కేసు కొలిక్కి రాబోతోంది. కాగా అసాంజే బ్రిటన్‌లో ఆశ్రయం పొందారు. అతడిని అమెరికాకు అప్పగించేందుకు జూన్ 2022 బ్రిటన్ అంగీకరించింది. ఆ ప్రక్రియ జరుగుతుండగానే ఈ పరిణామం చోటుచేసుకుంది.