KTR: ఇదీ కేసీఆర్ సర్కారు ఘనత: కేటీఆర్ ట్వీట్
- రైతుల సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చామని వెల్లడి
- ఫార్మర్ ఫస్ట్ విధానం పాటించినట్లు వివరణ
- వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పాలసీలు తీసుకొచ్చామన్న మాజీ మంత్రి
కేసీఆర్ పాలనలో రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యమిచ్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఫార్మర్ ఫస్ట్’ అనేది కేవలం నినాదంగా మాత్రమే కాకుండా చేతల్లో చూపించామని తెలిపారు. వ్యవసాయ రంగంలో కనివినీ ఎరుగని విప్లవాత్మక మార్పులను కేసీఆర్ హయాంలో తీసుకొచ్చామని చెప్పారు. ఇదీ మా కేసీఆర్ సర్కారు అతిపెద్ద ఘనత అంటూ కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. అందులో రైతుల సంక్షేమం కోసం, సాగును కాపాడుకోవడానికి కేసీఆర్ రూపకల్సన చేసి, అమలు చేసిన పలు పథకాల వివరాలను గుర్తుచేశారు.
దేశంలోనే తొలిసారిగా అన్నదాతలకు ఇన్ పుట్ సబ్సిడీ అందించింది కేసీఆర్ సర్కారేనని, రైతుబంధు పథకంతో 70 లక్షల మంది రైతులకు 73 వేల కోట్లు అందించామని కేటీఆర్ చెప్పారు. రైతు భీమా పథకం కింద ప్రతీ రైతుకు రూ.5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించామని వివరించారు. రెండుసార్లు రైతుల రుణమాఫీ చేశామని, దీనికోసం రూ.25 వేల కోట్లు వెచ్చించామని గుర్తుచేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ పథకంతో వేలాది చెరువులను పునరుద్ధరించామని, సాగునీటి కోసం కాళేశ్వరం, సీతారామ, పీఆర్ఎల్ఐ వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.