UPSC: పరీక్షల్లో చీటింగ్ ను అడ్డుకోవడానికి కృత్రిమ మేధ.. యూపీఎస్సీ నిర్ణయం
- పరీక్ష కేంద్రాల్లో ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
- ఫేసియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ తో అభ్యర్థుల ఎంట్రీ
- నీట్ పేపర్ లీక్ వివాదంతో అప్రమత్తమైన యూపీఎస్సీ
దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ వివాదంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అప్రమత్తమైంది. సర్వీస్ కమిషన్ పరీక్షల్లో చీటింగ్ కు తావివ్వకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకోవాలని భావిస్తోంది. ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో పరీక్ష కేంద్రాల్లో నిఘా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను సమకూర్చుకోవడానికి టెండర్లు పిలిచింది. దీంతోపాటు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థుల ఎంట్రీ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులలో 'మున్నాభాయ్' (ప్రాక్సీ) లను గుర్తించేందుకు ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థ, ఆధార్ ఆథెంటికేషన్ కోసం బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ- అడ్మిట్ కార్డుల్లోని క్యూఆర్ కోడ్ స్కానింగ్ ను ఉపయోగించనుంది.
పరీక్ష జరుగుతుండగా హాల్ లో అభ్యర్థుల ప్రతీ కదలికను గుర్తించేలా సీసీటీవీ కెమెరాలను అమర్చనుంది. ప్రతీ 24 మంది అభ్యర్థులకు ఓ సీసీటీవీ కెమెరాను అమర్చి నిఘా పెట్టనుంది. ఇలా పరీక్ష ప్రారంభమైన క్షణం నుంచి అభ్యర్థుల పేపర్లు ప్యాక్ చేసి, సీల్ చేసేంత వరకూ ప్రతీ క్షణం కెమెరాల్లో బంధించనుంది. హాల్ లో అనుమానాస్పద కదలికలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయనుంది. సీసీకెమెరాల ద్వారా సెంటర్లలో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, ఇన్విజిలేటర్ కదలకుండా ఒకేచోట ఉండిపోయినా, రూమ్ లో ఫర్నీచర్ సరిగ్గా అమర్చకపోయినా, కెమెరాలు ఆఫ్ లో ఉన్నా లేక మాస్కింగ్, బ్లాక్ స్క్రీన్ చూపించినా వెంటనే అప్రమత్తం చేసేందుకు ఏఐ సాయం తీసుకోనుంది. అదేవిధంగా ఎగ్జామ్ జరుగుతుండగా హాల్ ముందు, పరీక్ష సెంటర్ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ కలర్ కెమెరాలను ఇన్ స్టాల్ చేయనుంది.