T20 World Cup 2024: బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్‌లో తొలిసారి సగర్వంగా అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్.. ఆస్ట్రేలియా ఇంటికి!
- లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం
- బంతులతో చెలరేగిన నవీనుల్ హక్, రషీద్‌ఖాన్
- 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన బంగ్లాదేశ్
- జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్
- 27న రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు
- తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్థాన్
- రెండో మ్యాచ్‌లో ఇండియా-ఇంగ్లండ్ ఢీ
టీ20 ప్రపంచకప్‌లో ఇది మరో సంచలనం. రషీద్‌ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీస్‌కు చేరింది. సూపర్ 8 గ్రూప్-1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోవాలంటూ ఆస్ట్రేలియా అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆఫ్ఘన్ జట్టు విజయంతో టోర్నీ నుంచి ఆసీస్ నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ స్టార్ బౌలర్ నవీనుల్ హక్, రషీద్‌ఖాన్ పదునైన బంతులకు బెంబేలెత్తిన బంగ్లాదేశ్ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. హక్, రషీద్ చెరో నాలుగు వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. ఓపెనర్ లిటన్‌దాస్ (54) చివరి వరకు క్రీజులో ఉండి నాటౌట్‌గా నిలిచినప్పటికీ జట్టును పరాజయం బారి నుంచి కాపాడలేకపోయాడు. జట్టులో నలుగురు డకౌట్ అయ్యారు. లిటన్‌దాస్ తర్వాత తౌహిద్ హృదయ్ చేసిన 14 పరుగులే జట్టులో అత్యధికం.
పరుగుల కోసం చెమటోడ్చిన ఆఫ్ఘన్ బ్యాటర్లు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. బౌలర్లు పొదుపుగా బంతులు విసరడంతో పరుగులు రాబట్టేందుకు ఆఫ్ఘన్ బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. తస్కిన్ అహ్మద్ నాలుగు ఓవర్లు వేసి ఒక మెయిడెన్ తీసుకుని 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. రిషద్ హొసైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులను జాగ్రత్తగా ఎదుర్కొంటూ వికెట్లను కాపాడుకునే ప్రయత్నం చేసిన ఆఫ్ఘనిస్థాన్ చివరికి 115 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ గుర్బాజ్ 43 పరుగులు చేయగా, ఇబ్రహీం జద్రాన్ 18, అజ్మతుల్లా 10, కెప్టెన్ రషీద్‌ఖాన్ 19 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన నవీనుల్ హక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఫలించని ఆస్ట్రేలియా ప్రార్థనలు
ఈ విజయంతో సెమీఫైనల్ సమీకరణాలు మారిపోయాయి. గత రాత్రి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆఫ్ఘనిస్థాన్ ఓడితే సెమీస్‌కు వెళ్లొచ్చని భావించింది. ఇప్పుడు ఆఫ్ఘన్ గెలుపుతో ఆసీస్ టోర్నీ నుంచి పెట్టేబేడా సర్దేసుకుంది. గ్రూప్-1లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు సెమీస్‌కు చేరగా, గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఎల్లుండి సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్-1 మ్యాచ్ జరగనుండగా, అదే రోజు భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది.