Rashid Khan: కోపంతో సహచర ఆటగాడిపై బ్యాట్ విసిరికొట్టిన రషీద్‌ఖాన్.. వీడియో ఇదిగో!
- బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఘటన
- రెండో పరుగు తీసేందుకు నిరాకరించడంతో కోపం
- రషీద్ తీరుపై రెండుగా చీలిపోయిన నెటిజన్లు
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కరీమ్ జనత్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రషీద్ సహనం కోల్పోయాడు. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో తంజీమ్ హసన్ షకీబ్ వేసిన బంతిని రషీద్ హెలికాప్టర్ షాట్ ఆడాడు.
బౌండరీకి వెళ్తుందనుకున్న బంతి కవర్స్‌లోకి వెళ్లింది. అప్పటికే ఒక పరుగు పూర్తిచేసిన రషీద్ రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ పిచ్ మధ్యకు వచ్చేశాడు. అయితే, అప్పటికే స్ట్రైకర్ ఎండ్ వద్దకు చేరుకుని నిల్చున్న కరీమ్ జనత్.. రషీద్‌ను వారించాడు. వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రషీద్‌ఖాన్ సహనం కోల్పోయి తన బ్యాట్‌ను బలంగా జనత్ వైపు విసిరికొట్టాడు. అదికాస్తా అతడి కాళ్ల వద్దకు వెళ్లి ఆగింది. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న వారితోపాటు టీవీల్లో వీక్షిస్తున్న వారు సైతం రషీద్ ప్రవర్తనకు విస్తుపోయారు.
రషీద్‌ఖాన్ కోపాన్ని నియంత్రించుకొనే స్కిల్స్ నేర్చుకోవాలని నెటిజన్లు సలహా ఇచ్చారు. రషీద్ ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుందని మరికొందరు తప్పుబట్టగా, కొందరు మాత్రం రషీద్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. 10 బంతుల్లో 19 పరుగులు చేసిన రషీద్.. పరుగులేమీ చేయకుండా నిల్చుని పరుగు తీసేందుకు నిరాకరించిన పార్ట్‌నర్‌పై బ్యాట్ విసరడం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు.