Rahul Gandhi: స్పీకర్ ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్పాం, కానీ.. : రాహుల్ గాంధీ

Rahul Gandhi Condition For Supporting BJP Speaker Candidate
  • ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను రాజ్ నాథ్ సంప్రదించారని వెల్లడి
  • డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని అడిగామన్న కాంగ్రెస్ అగ్రనేత
  • అధికార పక్షం నుంచి స్పందన లేకపోవడంతోనే సురేశ్ ను నిలబెట్టినట్లు వివరణ
లోక్ సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సభా సంప్రదాయాలను పాటించడంలేదని విమర్శించారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తాము సహకరిస్తామని చెప్పినా ఎన్డీఏ కూటమి నేతలు వినిపించుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్షంగా తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించామని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ విషయంపై తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో సంప్రదించారని తెలిపారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించి ఫోన్ చేస్తానని రాజ్ నాథ్ చెప్పారని, అయితే ఇప్పటి వరకూ తమ పార్టీ చీఫ్ కు ఎలాంటి ఫోన్ రాలేదని రాహుల్ తెలిపారు. దీంతో ఇండియా కూటమి తరఫున స్పీకర్ బరిలో ఎంపీ సురేశ్ ను నిలబెట్టక తప్పలేదన్నారు.

లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం ఆనవాయతీ అని, యూపీఏ హయాంలో తాము దీనిని పాటించామని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరిన అధికారపక్షం.. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు. ఓవైపు స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించాలని అడుగుతూనే.. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను అవమానిస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
Rahul Gandhi
Speaker
lok sabha
BJP
NDA
INDIA
Congress

More Telugu News