Hanuma Vihari: కెప్టెన్ గా తప్పుకోకపోతే జట్టులోనే ఉండవు అని బెదిరించారు: హనుమ విహారి

Hanuma Vihari talks to media after meeting with AP minister Nara Lokesh
  • వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు బలైన హనుమ విహారి
  • ఓ ఆటగాడికి జట్టులో చోటివ్వలేదని విహారిపై ఆగ్రహం
  • కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి
  • విధిలేని పరిస్థితుల్లో రాజీనామా చేసిన విహారి
  • ఇవాళ మంత్రి లోకేశ్ భరోసాతో మళ్లీ ఆంధ్రా క్రికెట్ లోకి వస్తున్నట్టు వెల్లడి
ఇవాళ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన అనంతరం టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడారు. మంత్రి నారా లోకేశ్ తో సమావేశంలో క్రికెట్ గురించి చర్చించామని వెల్లడించారు. 

గతంలో తనకు వేధింపులు ఎదురయ్యాయని, కెప్టెన్సీకి రాజీనామా చేయాలని తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని హనుమ విహారి వెల్లడించారు. ఆత్మగౌరవం దెబ్బతినడంతో ఇక్కడ ఉండలేక, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని వేరే రాష్ట్రాల తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 

ఆ వివాదం సమయంలో లోకేశ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి తనకు మద్దతుగా నిలిచారని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత... తనను కలవాలంటూ లోకేశ్ ఆహ్వానించారని, భవిష్యత్ పై ఆయన భరోసా ఇచ్చారని విహారి పేర్కొన్నారు. ఆంధ్రా క్రికెట్ జట్టును నీ నాయకత్వంలో మరింత ముందుకు నడిపించాలి అని భరోసా ఇచ్చారు కాబట్టి మళ్లీ పునరాగమనం చేస్తున్నాను అని వెల్లడించారు. 

"ఓ కెప్టెన్ గా నేను ఎప్పుడూ టీమ్ గురించే ఆలోచిస్తాను. గత ఏడేళ్లలో ఆంధ్రా జట్టు 6 పర్యాయాలు దేశవాళీ క్రికెట్లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఒక్కోసారి జట్టు ప్రయోజనాల రీత్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, నేను తీసుకున్న నిర్ణయం ఆ గవర్నమెంట్ కు కానీ, ఆ అసోసియేషన్ కు కానీ నచ్చలేదు. 

వారు అనుకున్న ఆటగాడు తుది 15 మందిలో లేకపోవడంతో కొందరికి నా నిర్ణయం నచ్చలేదు. అందుకే వాళ్ల మాట వినే వ్యక్తినే కెప్టెన్ చేయాలనుకున్నారు. అందుకే, ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా నన్ను కెప్టెన్ గా తప్పుకోవాలని ఒత్తిడి చేశారు. లేకపోతే జట్టులో కూడా స్థానం ఉండదని అనడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో నేను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

కెరీర్ ముఖ్యం కాబట్టి, ఓ ఆటగాడిగానైనా జట్టులో కొనసాగాలన్న ఉద్దేశంతో వాళ్ల ఒత్తిడికి తలొగ్గాను. ఆటపై గౌరవం ఉంది కాబట్టి, ఆ టోర్నమెంట్ అంతా ఆడిన తర్వాతే విషయాలన్నీ బయటపెట్టాను" అని హనుమ విహారి వివరించారు.
Hanuma Vihari
Cricketer
ACA
Nara Lokesh
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News