YSRCP: ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక... ఎన్డీయేకి మద్దతు పలికిన వైసీపీ!
- లోక్ సభ స్పీకర్ ఏకగ్రీవానికి అడ్డంకులు
- స్పీకర్ అభ్యర్థిని బరిలో దించనున్న ఇండియా కూటమి
- ముందు జాగ్రత్తగా తటస్థ పార్టీల మద్దతు కోరుతున్న ఎన్డీయే
- లోక్ సభలో వైసీపీకి నలుగురు సభ్యులు
ఈసారి లోక్ సభ స్పీకర్ ఎన్నిక వ్యవహారం ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా మరోసారి స్పీకర్ పదవి చేపట్టేందుకు నామినేషన్ వేయగా... ఇండియా కూటమి తరఫున కేరళ ఎంపీ సురేశ్ బరిలో దిగుతారని తెలుస్తోంది.
ఇండియా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఎన్డీయే కూటమి అప్రమత్తమైంది. పలు పార్టీలను బయటి నుంచి మద్దతు అందించాలని ఎన్డీయే విజ్ఞప్తి చేస్తోంది. ఎన్డీయేకి లోక్ సభలో 293 మంది ఎంపీల బలం ఉండగా, లోక్ సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తటస్థ పార్టీలను కూడా కలుపుకుని పోవాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో, ఏపీ రాజకీయ పక్షం వైసీపీ కూడా ఎన్డీయేకి మద్దతు పలికింది. వైసీపీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. స్పీకర్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్డీయే... చిన్న పార్టీలు, తక్కువ మంది ఎంపీలు ఉండే పార్టీలు అని చూడకుండా, వీలైనంతగా ఎక్కువ పార్టీల నుంచి మద్దతు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
వైసీపీ మద్దతుతో ఎన్డీయే బలం 297కి పెరిగినట్టయింది. ఏపీ అధికార పక్షం టీడీపీ ఇప్పటికే ఎన్డీయేలో ఉండగా, వైసీపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఎన్డీయేకి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది.