T20 World Cup 2024: సెమీఫైనల్ గండం దాటేసిన దక్షిణాఫ్రికా.. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌లో అడుగు

The semi final jinx has finally been broken and South Africa are through to an ICC final
  • ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా
  • 57 పరుగుల సునాయాస లక్ష్యం 8.5 ఓవర్లలో ఛేదన 
  • 3 వికెట్లతో చెలరేగిన యన్‌సెన్‌కు దక్కిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’
ఐసీసీ ట్రోఫీలను ముద్దాడాలనే ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఎన్నో విఫలయత్నాలు.. ఎన్నో సార్లు ఆటగాళ్ల కన్నీళ్లు... వీటన్నింటికి ముగింపు పలికేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ 2024లో ఆ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి గ్రాండ్‌గా తుది సమరానికి అర్హత సాధించింది. దీంతో చారిత్రాత్మకంగా తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్‌లలో ఆ జట్టు ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్‌ల చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఆడిన ఆ జట్టు ఈ రోజు (గురువారం) తొలిసారిగా ఫైనల్ చేరింది. 

తొలుత బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 60 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ కేవలం 5 పరుగులకే వెనుతిరిగినప్పటికీ.. హెండ్రిక్స్ 29, కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ 23 మరో వికెట్ పడకుండా జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ మాత్రమే ఒక వికెట్ తీశాడు. 3 వికెట్లతో చెలరేగిన దక్షిణాఫ్రికా పేసర్ యన్‌సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’ దక్కింది.

దారుణంగా విఫలమైన ఆఫ్ఘనిస్థాన్
చారిత్రాత్మక రీతిలో టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీ ఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్థాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. ఆ జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. 10 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగారు. పేసర్ మార్కో యన్‌సెన్, స్పిన్నర్ షంషీ చెరో 3 వికెట్లు తీయగా.. పేసర్లు కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ఇక ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 2, గుల్బాదిన్ నబీ 9, మహమ్మద్ నబీ 0, నంగేయలియా ఖరోటే 2, కరీం జనత్, రషీద్ ఖాన్ 8, నూర్ అహ్మద్ 0, నవీన్ ఉల్ హక్ 2, ఫరూఖీ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
T20 World Cup 2024
Team South Africa
Cricket
South Africa Vs Afghanistan

More Telugu News