Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సరికొత్త విధానం.. రైలు దిగాక టికెట్ కొనొచ్చు!
- హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానం
- ఈ విధానంలో పలు లోపాలు
- త్వరలోనే ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ
- ముందు ప్రయాణించి ఆపై చార్జీ చెల్లించొచ్చు
- ఒకే కార్డుపై మెట్రో, బస్, ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే వెసులుబాటు
మీరు చదివింది నిజమే! హైదరాబాద్ మెట్రోలో త్వరలోనే సరికొత్త విధానం చూడబోతున్నాం. విదేశాల్లో ఉన్నట్టు ‘ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ’ (ఓటీఎస్)ను తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో యోచిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంలో ప్రయాణికులు తొలుత టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేయొచ్చు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు.
ప్రస్తుతం ఉన్న క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి. ఫలానా స్టేషన్‌కు టికెట్ తీసుకుని, మధ్యలో మనసు మార్చుకుని ముందు స్టేషన్లో దిగితే బయటకు వెళ్లేందుకు టికెట్ అనుమతించదు. కాబట్టి స్టేషన్ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ ఓపెన్ లూపింగ్ వ్యవస్థతో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటిలోనూ ఒకే కార్డుతో ప్రయాణించవచ్చు. రెండేళ్ల క్రితం హర్యానాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బస్సు ఎక్కేటప్పుడు కార్డు చూపించి మళ్లీ దిగేటప్పుడు చూపిస్తే ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు కట్ అవుతాయి. 2012లో లండన్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అది విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.