USA: అమెరికాలో బంధువుతో ఎన్నారైల వెట్టిచాకిరీ! రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలన్న కోర్టు

NRI couple ordered to  1 crore 80 lakh as compensation to kin for forced labor
  • పైచదువుల ఆశచూపి బాధితుడిని అమెరికాకు రప్పించిన నిందితులు
  • అమెరికాలో బాధితుడి డాక్యుమెంట్లు తీసేసుకుని వెట్టిచాకిరీ చేయించిన వైనం
  • షాపులో రోజుకు 12-17 గంటలు పనిచేయించుకున్న నిందితులు
  • సెలవు అడిగితే తుపాకీతో బెదిరింపులు
  • నిందితులిద్దరికీ న్యాయస్థానం జైలు శిక్ష
పైచదువులు చెప్పిస్తామని ఆశపెట్టి, అమెరికాకు తీసుకొచ్చాక బంధువుతో వెట్టిచాకిరీ చేయించుకున్న భారతీయ అమెరికన్ జంటకు కోర్టు భారీ షాకిచ్చింది. నిందితులకు జైలు శిక్ష విధించడమే కాకుండా బాధితుడికి రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. నిందితుడు హర్మన్ ‌ప్రీత్ సింగ్ కు 11.25 ఏళ్ల జైలు శిక్ష, అతడి భార్య కుల్బీర్ కౌర్‌కు 7.25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  

అమెరికా అటార్నీ తెలిపిన వివరాల ప్రకారం, బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని నిందితులు తమ బంధువైన కుర్రాడిని, పైచదువులు, మంచి జీవితం పేరిట ఆశపెట్టి అమెరికాకు రప్పించుకున్నారు. ఆ తరువాత అతడి వద్ద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వేధింపులకు పాల్పడుతూ తక్కువ జీతానికి వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వర్జీనియాలో తమ గ్యాస్ స్టేషన్, షాపులో రోజుకు 12 - 17 గంటల చొప్పున పని చేయించుకున్నారు. రకరకాల బెదిరింపులకు దిగుతూ చివరకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా వేధించారు. 

షాపు వెనకభాగంలోని స్టోర్ రూంలో నిద్రించేలా చేశారు. ఇండియాకు వెళ్లేందుకు అనుమతించక, వీసా గడువు ముగిసినా అమెరికాలో కొనసాగేలా చేశారు. తన డాక్యుమెంట్లు ఇవ్వమని కోరితే దాడికి దిగడమే కాకుండా సెలవు అడిగితే తుపాకీతో చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. చివరకు అతడికి కౌర్‌తో బలవంతంగా పెళ్లి చేసి కుటుంబ ఆస్తులను లాగేసుకుంటామని, తప్పుడు పోలీసు కేసు పెడతామని బెదిరించారు.
USA
NRI
Forced Labor

More Telugu News