Toll: రోడ్లు బాగుంటేనే టోల్ వసూలు చేయాలి.. లేదంటే వ్యతిరేకత తప్పదు: నితిన్ గడ్కరీ
- అధ్వాన రోడ్లకు కూడా టోల్ వసూలు చేయడం మానుకోవాలన్న గడ్కరీ
- నాణ్యమైన సేవలు అందించకుండా చార్జీలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్న
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపగ్రహ ఆధారిత టోల్ చార్జీలు!
రోడ్లు బాగున్నా, బాగాలేకున్నా టోల్ వసూలు చేస్తుండడంపై కేంద్ర రహదారులు, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రోడ్లు బాగాలేకుండా టోల్ వసూలు చేయడం మానుకోవాలని హైవే సంస్థలకు సూచించారు. నాణ్యమైన సేవలు అందించనప్పుడు టోల్ వసూలు చేయవద్దని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 వేల కిలోమీటర్లకుపైగా రోడ్లకు ఉపగ్రహ ఆధారిత టోలింగ్‌ను అమలు చేయడంపై నిన్న నిర్వహించిన గ్లోబల్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మన ప్రయోజనాల కోసం యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఆత్రుతగా ఉంటున్నామని గడ్కరీ విమర్శించారు. నాణ్యమైన రోడ్లు అందించినప్పుడు మాత్రమే టోల్ వసూలు చేయాలని సూచించారు. బురద, గుంతలతో నిండిన రోడ్లకు కూడా చార్జీలు వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.