Rashid Khan: ఈ ప్రపంచకప్‌ను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.. ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ భావోద్వేగ ట్వీట్!
- 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శన
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఛాంపియన్ జట్లను ఓడించిన పసికూన
- దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమణ
- దీంతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
2024 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఛాంపియన్ జట్లకు షాకిచ్చి మరీ సెమీ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. అయితే, వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్ అద్భుత జర్నీ ముగిసింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీస్‌లో ఓడి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలిసారి వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్‌కి చేరాలనుకున్న ఆఫ్ఘన్‌కు పరాభవం ఎదురైంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ తో పాటు జట్టు ఆటగాళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు.
"ఈ ప్రపంచకప్‌ను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా పోరాడారు. వారి పట్ల నిజంగా గర్వంగా ఉంది. ఈ ఓటమి నుంచి నేర్చుకొని వచ్చే సీజన్‌లో గొప్పగా తిరిగొస్తాం. టోర్నీలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని రషీద్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ తడబడింది. 11.5 ఓవర్లలో 56 రన్స్‌కే కుప్పకూలింది. ఆ జట్టులో 10 పరుగులు చేసిన అజ్మతుల్లా టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక సఫారీ బౌలర్లలో జాన్‌సెన్, షంసీ చెరో 3 వికెట్లు తీస్తే.. కసిగో రబాడ, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది.