KTR: కేంద్రంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర చేస్తున్నారు: కేటీఆర్
- సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం బొగ్గు గనులను వేలం వేసిందని విమర్శ
- సింగరేణికి గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నమని వ్యాఖ్య
- సింగరేణి నష్టాల్లో ఉందంటూ ఆ తర్వాత పెట్టుబడుల ఉపసంహరణకు యత్నిస్తారని ఆరోపణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. సింగరేణికి గనులు కేటాయించకుండా నష్టాల్లోకి... కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సింగరేణి నష్టాల్లో ఉందని ఆ తర్వాత పెట్టుబడుల ఉపసంహరణకు యత్నిస్తారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలతో కేసీఆర్ ఉద్యమం నుంచే పని చేస్తున్నారని పేర్కొన్నారు. సమ్మె సమయంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఉద్యమ కాలంలో అద్భుతంగా పని చేశాయని కేటీఆర్ కితాబునిచ్చారు.