Say No To Drugs: తెలంగాణ ప్రభుత్వ డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి చిరంజీవి ప్రచారం... వీడియో ఇదిగో!
- డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ ప్రభుత్వం
- డ్రగ్స్ ముప్పు పట్ల ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కార్యక్రమాలు
- డ్రగ్స్ తో పతనమైన యువకుడి జీవితాన్ని వీడియోలో వివరించిన చిరంజీవి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. డ్రగ్స్ వ్యతిరేక కార్యాచరణను ముమ్మరం చేసింది. డ్రగ్స్ ముప్పు పట్ల ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మెగాస్టార్ చిరంజీవి సాయం కూడా తీసుకుంటోంది.
తాజాగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి చిరంజీవి మద్దతు పలికారు. ఈ మేరకు రూపొందించిన ఓ వీడియోలో ఆయన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేశారు. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో ఉద్యోగం సంపాదించిన శేఖర్ అనే యువకుడు డ్రగ్స్ కు బానిసై, ఎలా పతనమయ్యాడో ఇందులో చూపించారు. అతడి కలలు ఎలా నాశనం అయ్యాయో కూడా వివరించారు.
ఇలా ఎందరో డ్రగ్స్ కు ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని... మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా, అమ్మడం కానీ, కొనడం కానీ చేస్తున్నా ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండి అంటూ చిరంజీవి పిలుపునివ్వడం ఆ వీడియోలో చూడొచ్చు.