Delhi Airport: కుప్పకూలిన ఢిల్లీ విమానాశ్రయ రూఫ్.. ఒకరి మృతి.. వీడియో ఇదిగో!
- ఈ తెల్లవారుజామున ఘటన
- ఘటనను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న మంత్రి రామ్మోహన్నాయుడు
- చెక్ ఇన్ కౌంటర్ల మూసివేత
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు విమానాల బంద్
- పార్కింగ్ లేన్‌లోని కార్లు నుజ్జునుజ్జు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం టెర్మినల్-1డి పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘనటనతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు రద్దు చేశారు.
రూఫ్ షీట్‌తోపాటు దానికి సపోర్టింగ్‌గా ఉన్న పిల్లర్లు ఈ తెల్లవారుజామున కుప్పకూలాయి. దీంతో డిపార్చర్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.
గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానలతో ఢిల్లీ రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.