Revanth Reddy: 'చంద్రబాబు చెబితే జగన్ ఇంటి గోడలు కూలగొట్టారా?' అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం ఇదీ!
- చంద్రబాబు కోసం నా ఉద్యోగం వదులుకుంటానా? అన్న రేవంత్ రెడ్డి
- నా ప్రత్యర్థి కేసీఆర్ ఫామ్ హౌస్ గదులే ముట్టలేదు... జగన్‌వి ముట్టుకుంటానా? అని ప్రశ్న
- చచ్చిన పాము జగన్... ఆయన గదులు కూల్చమని చెప్పే అవసరం చంద్రబాబుకు ఏముందని ప్రశ్న
- తెలంగాణలో, పోటీలో టీడీపీ ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని వ్యాఖ్య
- బండి సంజయ్ ఉండి ఉంటే... తన తర్వాత ఆయనకు అవకాశం ఉండేదేమోనన్న రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల విషయంలో తాను రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... చంద్రబాబు ఏపీ కోసం ఎంత నిబద్ధతతో పని చేస్తారో... తెలంగాణ కోసం తానూ అలాగే పని చేస్తానన్నారు. చంద్రబాబు ఏదో చెప్పారని రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడితే ప్రజలు తనను రాజకీయాల్లో క్షమిస్తారా? అని ప్రశ్నించారు. తన ఉద్యోగం కోసమే చంద్రబాబును వదిలి వచ్చానని... అలాంటప్పుడు ఆయన కోసం ఉద్యోగం వదులుకుంటానా? అన్నారు.
కేసీఆర్‌వే ముట్టలేదు... జగన్‌వి కూలగొడతానా?
హైదరాబాద్‌లోని జగన్ ఇంటిముందు కూల్చివేతల గురించి తనకు ఎవరూ చెప్పలేదన్నారు. దీనిపై ఆరా తీస్తే ఓ నాయకుడు చెబితే అధికారులు అలా చేశారని తెలిసిందని... అందుకే వారిని సరెండర్ చేశామన్నారు. కానీ, చంద్రబాబు చెబితే తాను అలా చేశానని బయట ప్రచారం జరిగిందని... అది అవాస్తవమన్నారు. జగన్ చచ్చిన పాము అని... అలాంటి వ్యక్తి ఇంటి ముందు ఉన్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని ప్రశ్నించారు. అసలు తన ప్రధాన ప్రత్యర్థి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే ఏవేవో కట్టుకున్నారని... వాటినే తీయలేదని... ఇక జగన్‌వి తాను ఎందుకు ముట్టుకుంటానన్నారు.
హైదరాబాద్‌కు అమరావతి పోటీ కాదు
మన సొంత పగలు తీర్చుకోవడానికి ప్రజలు మనకు అధికారాన్ని ఇవ్వలేదనే విషయాన్ని జగన్‌ను చూసి నేర్చుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు జగన్‌కు 151 సీట్లు ఇస్తే పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారని... అందుకే ప్రజలు తాజా ఎన్నికల్లో 11 సీట్లకు సరిపెట్టారన్నారు. హైదరాబాద్‌కు అమరావతి పోటీయే కాదన్నారు. హైదరాబాద్‌ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారని తాను భావించడం లేదన్నారు. అమరావతిలో లాభం ఉంటే మనం తాడుతో కట్టేసినా ఆగిపోరన్నారు.
టీడీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో!
కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని భావించారని... కానీ ఆయనే తుడిచిపెట్టుకుపోయారని మండిపడ్డారు. సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో... మనుషులకో పనికి వస్తాయన్నారు. టీడీపీకి పోటీ చేసే పరిస్థితిని కల్పించి ఉంటే వాళ్లు 10 శాతం ఓట్లు దక్కించుకునే వారని జోస్యం చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసులన్నీ ఒకేసారి తెరిస్తే పని చేయలేను
గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే తాను ఏ పనీ చేయలేకుండా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని పనులూ ఆగిపోతాయన్నారు. కేసులతో రాజకీయ ప్రయోజనాల మాట పక్కన పెడితే... వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. తాను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ మాత్రమే ఉండరని... ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు ఉంటాయన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే బ్యాంకులు ఆ కంపెనీలకు ఒక్క రూపాయి అప్పు ఇవ్వవని తెలిపారు. ఓడీలను వెనక్కు తీసుకుంటాయన్నారు.
మా ప్రత్యర్థి ఎవరనేది పనితీరుపై ఆధారపడి ఉంటుంది
ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మంచిదా? చెడ్డదా? అనేది ఇప్పుడు విషయం కాదని... ప్రభుత్వాన్ని నిలుపుకోవాలన్నారు. ప్రభుత్వమే పోతే వాటి గురించి మాట్లాడుకోవడంలో అర్థం ఉండదన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ ఓట్లు తామే వేసుకుంటే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 సీట్లు గెలిచి ఉండేదన్నారు. మున్ముందు తమ ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనేది బీజేపీ, కేసీఆర్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. కేసీఆర్ విధానాన్ని బట్టి రాష్ట్ర రాజకీయాలు ఉంటాయన్నారు.
అందుకే బీజేపీ అక్కడ గెలిచింది
హరీశ్ రావు ట్రాప్‌లో కేసీఆర్ పడ్డారని... భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం కష్టమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమే అన్నారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్‌ను తీసుకోవచ్చునని హరీశ్ రావు చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని... అందుకే మళ్లీ గెలిచారన్నారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి మాత్రం అలా లేదన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు బీజేపీకి పడి... మల్కాజ్గిరి, చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరిందన్నారు.
నా తర్వాత బండి సంజయ్...
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను దించాలా? రేవంత్ రెడ్డిని గెలిపించాలా? అనే అంశంపైనే జరిగాయన్నారు. పదేళ్లు కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడానన్నారు. అందుకే ప్రజలు తనను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని పేర్కొన్నారు. పాలనలో తన మార్క్ ముద్ర వేస్తానన్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ ఉండి ఉంటే (బీజేపీ అధ్యక్షుడిగా) తన తర్వాత అవకాశం వచ్చేదేమో అన్నారు.