KCR: జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ వీడటంపై కేసీఆర్ ఆగ్రహం... కీలక వ్యాఖ్యలు
- పార్టీని వీడి దొంగలతో కలిసే వారి గురించి బాధలేదన్న కేసీఆర్
- రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని వదిలి వెళ్లిపోయారని మండిపాటు
- కార్యకర్తల నుంచే మంచి నాయకుడిని తయారు చేస్తానని వ్యాఖ్య
పార్టీని వీడి దొంగలతో కలిసేవారి గురించి బాధలేదని... తెలంగాణ సాధించిన మనకు ఇలాంటి ఒడిదుడుకులు ఓ లెక్కనా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆయన వదిలి వెళ్లిపోయారన్నారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన లేరని వ్యాఖ్యానించారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారని విమర్శించారు. అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. కార్యకర్తల నుంచే మంచి నాయకుడిని తయారు చేస్తానన్నారు.
పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. నాడైనా... నేడైనా... నాయకులను తయారు చేసుకున్నది పార్టీయేనని... మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దామన్నారు.