Interest Rate: సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్, ఎన్ఎస్సీ పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం!
- జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పాత వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న ఆర్థిక శాఖ
- అత్యధికంగా సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2 శాతం వడ్డీ రేటు
- చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్ల సవరణ
2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి గాను చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న వడ్డీ రేట్లు జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఎన్ఎస్సీ, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ తదితర పథకాలపై పాత వడ్డీ రేట్లు కొనసాగుతాయని తెలిపింది.
సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్‌పై 4 శాతం, కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కం స్కీంపై 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ మూడు నెలలకు ఓసారి మారుస్తుంది.