20 World Cup 2024 Final: ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసిన టీమిండియా.. ఐసీసీ ప్రకటన

India Cancel Practice Session Ahead Of T20 World Cup 2024 Final
  • అలసట కారణంగా ప్రాక్టీస్ రద్దు
  • వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో ఆలస్యం.. ముగిసిన వెంటనే బార్బడోస్ బయలుదేరిన టీమిండియా
  • నేటి రాత్రి 8 గంటలకు భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్
భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (శనివారం) టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా జరిగింది. దీంతో మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా బార్బడోస్ బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. ఆటగాళ్లంతా అలసటతో ఉండడంతో ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించిందని ఒక ప్రకటనలో ఐసీసీ పేర్కొంది. ఇక భారత జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననుందని పేర్కొంది.

మరోవైపు బుధవారం జరిగిన సెమీ-ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌ను ఆ జట్టు నిర్వహించనుందని, ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో కూడా ఆ జట్టు పాల్గొంటుందని ఐసీసీ ప్రకటన పేర్కొంది.

మ్యాచ్‌కు వాన గండం..
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచివుంది. మ్యాచ్‌ సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. మ్యాచ్ సమయంలో 99 శాతం మేఘావృతమై ఉంటుందని, 60 శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం ఉందని ‘ఆక్యూవెదర్’ అంచనా వేసింది. వాతావరణం ఎక్కువగా మేఘావృతమై తేమగా ఉంటుందని, ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. మ్యాచ్ సమయంలో వర్షం పడుతూ ఆగిపోతుంటుందని ‘ఆక్యూవెదర్’ వెబ్‌సైట్ పేర్కొంది.

కాగా వర్షం కారణంగా శనివారం జరగాల్సిన మ్యాచ్ రద్దయితే ఆదివారం రిజర్డ్ డేగా ఉంది. అయితే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ రిజర్డ్ డే కూడా రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
20 World Cup 2024 Final
India vs South Africa
Cricket
Team India
World cup final

More Telugu News