T20 World Cup 2024: నేడు టీ20 ఫైనల్: భారత్-సౌతాఫ్రికా జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయి.. ఎవరిది పైచేయి?
- టీ20ల్లో సఫారీలపై భారత్‌దే పైచేయి
- ఇప్పటి వరకు 26 సార్లు తలపడిన జట్లు
- 14 సార్లు భారత్‌దే విజయం.. ఒకటి టై
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నేటి రాత్రి భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరం జరగనుంది. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందని వాతావరణశాఖ చెబుతోంది. నేడు మ్యాచ్ రద్దయితే రేపు (ఆదివారం) రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రేపు కూడా వర్షంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే, అలా జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆ విషయాన్ని కాసేపు పక్కనపెడితే, టీ20ల్లో భారత్-సఫారీ జట్లు ఎన్నిసార్లు హెడ్ టు హెడ్ తలపడ్డాయి.. ఎవరిది పైచేయి అయింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇరుజట్లు ఇప్పటి వరకు 26సార్లు తలపడ్డాయి. భారత్ 14 సార్లు, సఫారీలు 11సార్లు విజయం సాధించారు. ఒకదాంట్లో విజయం తేలలేదు. సౌతాఫ్రికాపై భారత్ అత్యధిక స్కోరు 237/3. గువాహటిలో 2 అక్టోబర్ 2022లో జరిగిన మ్యాచ్‌లో రికార్డయింది. ఈ గణాంకాలు బట్టి చూస్తే సౌతాఫ్రికాపై భారత జట్టుదే పైచేయిగా ఉంది.
ఇక తాజా టోర్నీకి వస్తే ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. రెండు జట్లు అద్వితీయమైన ఆటతీరు కనబరుస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ చూపెడుతున్నాయి.
టీ20 ప్రపంచకప్‌ను రెండోసారి చేజిక్కించుకోవాలని భారత్ పట్టుదలగా ఉండగా, అగ్రశేణి జట్లలో ఒకటైనప్పటికీ ఏ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోని దక్షిణాఫ్రికా ఈసారి ఫైనల్‌కు చేరుకుని తొలి కప్పుపై కన్నేసింది. ఈ నేపథ్యంలో వర్షం అంతరాయం కలిగించకుండా మ్యాచ్ జరిగితే పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. చూడాలి వరుణుడు ఏం చేస్తాడో మరి!