T20 World Cup Final: ఫైనల్‌లో స‌ఫారీల‌ను భారత్ ఎలా అడ్డుకోగ‌ల‌దు.. టీమిండియా వ్యూహాలు, అస్త్రాలు ఏమిటి?

How Can India Overcome The South Africa Challenge in T20 World Cup Final

  • టీమిండియా ప్ర‌ధాన అస్త్రం స్పిన్ త్రయం కుల్దీప్, అక్షర్, రవీంద్ర జడేజా  
  • కోహ్లీ త‌ప్పితే అద్భుతమైన ఫామ్‌లో మిగ‌తా భారత బ్యాట‌ర్లు
  • భారత్‌కు అనుకూలంగా కరేబియన్ స్లో పిచ్‌లు
  • ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను బెంబెలేత్తిస్తున్న అర్ష్‌దీప్‌, బుమ్రా, హార్దిక్ పాండ్యా  

పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్ కు ఒకేఒక్క అడుగుదూరంలో నిలిచింది టీమిండియా. దాదాపు 10 సంవత్సరాల తర్వాత భారత్ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీలో  బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా శనివారం జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధంగా ఉంది.  

మరో వైపు ప్రత్యర్థి జట్టు కూడా అంతే జోరులో ఉంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఓటమి ఎరుగకుండా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. బలాబలాలు, పోరాట స్ఫూర్తిలో ఏమాత్రం తీసిపోని వీరిద్దరిలో ప్రపంచకప్పును ముద్దాడేది ఎవరు? అనేది మ‌రికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి మరీ ఫైనల్‌లో అడుగు పెట్టిన రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా వ్యూహాలు, అస్త్రాలు ఏమిటి? దక్షిణాఫ్రికా సవాలును భారత్‌ ఎలా అధిగమించగలదు? ఫైనల్‌లో స‌ఫారీల‌ను భారత్ ఎలా అడ్డుకోగ‌ల‌దో ఇప్పుడు చూద్దాం. 
 
టీమిండియా ప్ర‌ధాన అస్త్రం స్పిన్ త్రయం 
ఇప్పటి వరకు కరేబియన్ వేదికలపై స్లో పిచ్‌లను కెప్టెన్‌ రోహిత్ శర్మ బాగా సద్వినియోగం చేసుకున్నాడు. స‌రియైన స‌మ‌యంలో స్పిన్న‌ర్లను బౌలింగ్‌కు దించి మంచి ఫ‌లితాలు రాబ‌ట్టాడు. కుల్దీప్ యాదవ్ (10), అక్షర్ పటేల్ (8), రవీంద్ర జడేజా (1)లతో కూడిన టీమిండియా స్పిన్ త్ర‌యం మొత్తం 47 ఓవర్లలో 6.66 ఎకానమీతో టోర్నీలో 19 వికెట్లు పడగొట్టింది. ఈ ముగ్గురు మిడిల్ ఓవర్లలో (7-15) చాలా బాగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను నిలువ‌రించారు. అయితే, ఫైన‌ల్ జ‌రిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ ఎంత‌వ‌ర‌కు స్పిన్‌కు అనుకూలిస్తుంద‌నేది తెలియ‌దు.   

కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత స్పిన్నర్ల గ‌ణాంకాలు ఇలా
రవీంద్ర జడేజా: మూడు మ్యాచ్‌ల్లో 12.14 ఎకానమీ రేటుతో రెండు వికెట్లు
కుల్దీప్ యాదవ్: ఒక మ్యాచ్‌లో  8.0 ఎకానమీ రేటుతో రెండు వికెట్లు
అక్షర్ పటేల్: ఒక మ్యాచ్‌లో 5.0 ఎకానమీ రేటుతో ఒక వికెట్

కోహ్లీ త‌ప్పితే అద్భుతమైన ఫామ్‌లో మిగ‌తా భారత బ్యాట‌ర్లు
ఈ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ప‌రుగులు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఐసీసీ టోర్నీల్లో రెచ్చిపోయే ర‌న్ మెషీన్ ఈసారి త‌డ‌బ‌డ్డాడు. ఎప్పుడూ టీమిండియా త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్‌గా దాదాపు అత‌నే ఉంటాడు. కానీ, ఈసారి విరాట్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 75 పరుగులు మాత్ర‌మే చేశాడు. క‌నీసం ఫైన‌ల్‌లోనైన రాణించి భార‌త్‌కు విజ‌యం అందించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

కాగా, భార‌త సార‌ధి రోహిత్ శర్మ (248 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (196 పరుగులు), రిషబ్ పంత్ (171 పరుగులు), హార్దిక్ పాండ్యా (139 పరుగులు) మెరుపు బ్యాటింగ్ కారణంగా ఈ టోర్నీలో టీమిండియా మంచి స్కోర్లు నమోదు చేయగ‌లింది. తుది జ‌ట్టులో న‌లుగురు ఆల్‌రౌండ‌ర్ల‌కు చోటు ద‌క్కుతుండ‌డంతో భార‌త‌ బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా కనిపిస్తుంది. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో నంబర్ 8లో వ‌చ్చే అక్షర్ పటేల్ వరకు టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్‌ను క‌లిగి ఉంది.

భారత్‌కు క‌లిసొస్తున్న‌ కరేబియన్ స్లో పిచ్‌లు 
ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8, ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌లో టీమిండియా ఆడిన తీరు అద్భుతం. వెస్టిండీస్‌లోని స్లో పిచ్‌లు భారత స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్‌లకు బాగా సహాయపడ్డాయి. దాదాపు మ‌న ద‌గ్గ‌ర ఉండే పిచ్‌ల మాదిరిగానే ఉండ‌డంతో వాటికి త‌గ్గ‌ట్టుగా భార‌త బౌల‌ర్లు బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను బోల్తా కొట్టించారు. అందుకే దక్షిణాఫ్రికాతో ఫైన‌ల్ జ‌రిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ కూడా భారత బౌల‌ర్ల‌కు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంది.

ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను బెంబెలేత్తిస్తున్న అర్ష్‌దీప్‌, బుమ్రా, హార్దిక్ పాండ్యా
టీమిండియా స్పిన్‌తో పాటు పేస్ విభాగం కూడా బ‌లంగానే ఉంది. ఈసారి అర్ష్‌దీప్‌, బుమ్రా, హార్దిక్ పాండ్యా ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల బ్యాట‌ర్ల‌ను ప‌దునైన బంతుల‌తో బెంబేలెత్తిస్తున్నారు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ (15 వికెట్లు) ఉన్నాడు. ఆ త‌ర్వాత జ‌స్ప్రీత్‌ బుమ్రా (13 వికెట్లు), ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా (8 వికెట్లు) ఫాస్ట్ బౌలింగ్‌లో అద‌ర‌గొడుతున్నారు. ఇది దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్‌కు ముప్పుగా మారొచ్చు.

ఇదిలాఉంటే.. ఇక టీమిండియా 2007లో తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ గెలించింది. అలాగే 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. కానీ, ఆ త‌ర్వాత‌ నుండి భార‌త్ మ‌రో ఐసీసీ ట్రోఫీ గెల‌వ‌లేదు. ప‌లుమార్లు ట్రోఫీకి అడుగుదూరంలో ఆగిపోవ‌డం జ‌రిగింది. రెండుసార్లు టెస్టు ఛాంపియ‌న్ షిప్‌, ఒక‌సారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్స్‌లో ఓట‌మి చ‌విచూసింది. అందుకే మెన్ ఇన్ బ్లూకు ఇప్పుడు ఐసీసీ టైటిల్ గెలిచి 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరదించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని టీమిండియా టైటిల్ గెలవాలి. స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని కూడా ఇదే కోరుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News