Mann Ki Baat: ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలి ‘మన్ కీ బాత్’!..మరికాసేట్లో..!
- ఎన్నికల విరామం తరువాత మళ్లీ ప్రారంభం కానున్న మన్ కీ బాత్
- ప్రజలను కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రధాని ట్వీట్
- సమాజ శ్రేయస్సు కోసం ఉమ్మడి కృషి అవసరమంటూ కామెంట్
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతి నెల చివరి ఆదవారం ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25న చివరి మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు ప్రధాని..మన్ కీ బాత్కు విరామం ఇచ్చారు. తాజాగా ఆయన దేశప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెడుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం ఉమ్మడి కృషి అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కాగా, మన్ కీ బాత్ మళ్లీ ప్రారంభం అవుతుందని జూన్ 18నే మోదీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. కార్యక్రమంపై ప్రజలు తమ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. Mygov Open forum, NaMo యాప్, లేదా 1800-11-7800కు కాల్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.
2014 అక్టోబర్లో మన్ కీ బాత్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్టు ప్రధాని అప్పట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ అంశాలు, ఇతర స్ఫూర్తివంతమైన విషయాలు పంచుకునేందుకు తనకు ఇదో చక్కని వేదికని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియోకు ఉన్న 500 బ్రాడ్ కాస్టింగ్ సెంటర్ల ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 22 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, చైనీస్, అరబిక్ వంటి 11 విదేశీ భాషల్లోకి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.