Prabhas: 'కల్కి 2898 AD ' మండే టాక్!
- ఈ నెల 27వ తేదీన విడుదలైన 'కల్కి 2898 AD'
- భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా
- విస్తృతమైన కథా పరిధిని ఎంచుకున్న నాగ్ అశ్విన్
- క్లారిటీ లోపించిందంటున్న ఆడియన్స్
- ఈ రోజు నుంచి రాబట్టే వసూళ్లే కీలకం
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'కల్కి 2898 AD' ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. చాలా రోజుల తరువాత థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. నిజానికి ఈ సమ్మర్ లో థియేటర్ల దగ్గర జనాలు కనిపించలేదు . అంటే ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే సినిమాలు పెద్దగా రాలేదు. దాంతో ఒక మంచి సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్న సమయంలో ఇది థియేటర్లకు వచ్చింది.
ఈ కథ మహాభారత యుద్ధం సమయంలో మొదలై '2898 AD' చివరివరకూ నడుస్తుంది. అంటే అటు గతంలోకి .. ఇటు భవిష్యత్తులోకి వెళ్లి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా ఇది. ఇతిహాసమైన భారతాన్ని లింక్ చేస్తూ, 'కల్కి' అవతారానికి సంబంధించిన నేపథ్యాన్ని ఎంచుకుని ఆయన ఈ సినిమాను రూపొందించాడు. భారీతనం విషయంలో .. వీఎఫ్ ఎక్స్ విషయంలో నాగ్ అశ్విన్ కి మంచి మార్కులు పడిపోయాయి. అయితే కథలో చాలా వరకూ ఒక అయోమయం నెలకొందనే విమర్శలు వచ్చాయి.
ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పటికీ , అమితాబ్ 'అశ్వద్ధామ' పాత్ర హైలైట్ అయిందనే టాక్ వచ్చింది. ఒక రకంగా ఇది అమితాబ్ మూవీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. విస్తృతమైన కథను ఎంచుకుని, దానిని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో నాగ్ అశ్విన్ తడబడ్డాడనే టాక్ కూడా ఉంది. ఇక దీపికా పదుకొణెను చూపించిన తీరు పట్ల కూడా అసంతృప్తి ఉంది. లవ్ - రొమాన్స్ పాళ్లు కథలో కలవకపోవడం మాస్ ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ఈ రోజు నుంచి తన దూకుడును కొనసాగిస్తూ ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందనేది చూడాలి.